హర్మూజ్ మాదే : అమెరికా
జోక్యం సహించం : ఇరాన్
అణు కార్యక్రమాలపై పరిమితులు విధించాం : ట్రంప్
అంత్యక్రియలకు 30 దేశాల ప్రతినిధులు?
టెహ్రాన్ : ఇరాన్, అమెరికా మధ్య హర్మూజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్, అమెరికా అధికారుల మధ్య పరోక్ష చర్చలు ముగిశాయి. ఖమేనీ అంత్యక్రియల తరువాతే తదుపరి చర్చలని ఇరాన్ స్పష్టం చేసింది. హర్మూజ్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని టెహ్రాన్ హెచ్చరించింది. హర్మూజ్ నుండి ప్రయాణించే వాణిజ్య నౌకలు తమ ఆదేశాలను పాటించాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేసింది. జలసంధిపై అమెరికా పెత్తనం చేస్తానంటే పరిణామాలు తీవ్రంగా, వేగంగా ఉంటాయని ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. హర్మూజ్ అమెరికా ఆడుకోవడానికి ఆటస్థలం కాదు, అది ఇరాన్ సార్వభౌమాధికారమని ప్రకటనలో పేర్కొంది. ప్రపంచానికి కీలకమైన జలమార్గాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పరిరక్షిస్తుందని తేల్చి చెప్పింది.
చర్చలు ముగిసినా కానరాని పురోగతి..
పరోక్షంగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కన్పించలేదు. రెండు వారాల క్రితం ప్రకటించిన ఎంఒయులోని అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఇరు దేశాల ప్రతినిధులు రెండు రోజుల పాటు దోహాలో గడిపారని, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణా పైన, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల పైన చర్చించారని అంతర్జాతీయ మీడియా నివేదించింది.
ముందు అంత్యక్రియలు... ఆ తరువాతే చర్చలు..
శాంతి చర్చలను కొనసాగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అమెరికా - ఇజ్రాయిల్ హత్య చేసిన ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఈ నెల 9న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం తదుపరి సమావేశం జరుగుతుందని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. ఎంఒయులో పొందుపరచిన అంశాలపై దోహా చర్చలు ‘సానుకూల పురోగతి’ సాధించాయని, స్విట్జర్లాండ్‌లో శిఖరాగ్ర సమావేశపు ఫలితాల ఆధారంగా ఇవి సాగాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వివరించారు. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులతో వేర్వేరుగా సమావేశమయ్యారని ఆయన తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన పరిమితులపై ఇరు పక్షాలు పురోగతి సాధిస్తున్నాయని చెప్పారు. ‘ఇరు పక్షాల మధ్య మంచి సమావేశాలు జరుగుతున్నాయి. చూద్దాం’ అని అన్నారు.
హర్మూజ్ నుండి రికార్డు సంఖ్యలో నౌకలు బయలుదేరుతున్నాయని, కమ్యూనిజం ‘అతిపెద్ద ముప్పు’ అని మీడియాకు చెప్పుకొచ్చారు. చర్చలు ముగిశాయని ఇరాన్ ప్రతినిధి బృందం నాయకుడు, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కజమ్ ఘరీబబాడీ తెలిపారు. ఇరు పక్షాలు తమ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకున్నాయా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఈ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై ‘సానుకూల పురోగతి’ సాధించామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంత్యక్రియల తర్వాత తదుపరి సమావేశం వీలైనంత త్వరగా నిర్ణయిస్తాం ’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ భారీ సన్నాహాలు చేస్తోంది. ఈ అంత్యక్రియలకు రష్యా, చైనా, పాకిస్తాన్, భారతదేశం, జార్జియా, క్యూబాతో సహా 30కి పైగా దేశాల నుండి సీనియర్ అధికారులు, ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. 90 దేశాల నుండి మత నాయకులు కూడా పాల్గొంటారు. ఖమేనీ అంత్యక్రియలు జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమై, జూలై 9న ఆయన స్వస్థలమైన మషాద్‌లో ఖననంతో ముగుస్తాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది.








కామెంట్‌లు (0)