ఎల్‌ఐసిలో రూ.10వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్
ఎనిమిది పిఎస్‌యుల్లో అమ్మకాలు..
జాబితాలో హిందుస్తాన్ జింక్, ఐడిబిఐ, ఎన్‌హెచ్‌పిసి
న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజాగా మరిన్ని సంస్థల్లో వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను కారుచౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి)తో పాటు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను విక్రయించేందుకు కేంద్రం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మొత్తం ఎనిమిది కీలక ప్రభుత్వ సంస్థలను గుర్తించినట్లు సమాచారం. ఎల్‌ఐసి వాటాల విక్రయం ద్వారానే ప్రభుత్వం సుమారు రూ.10,000 కోట్లు, హిందుస్థాన్ జింక్ ద్వారా మరో రూ.5000 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తానికి విలువ చేసే వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించనుంది.
ఈ వాటాల విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే అధికారులు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. పెట్టుబడిదారుల ఆసక్తిని అంచనా వేయడం, ధరల నిర్ణయం, విక్రయాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేయడంపై వీరు దృష్టి సారించారు. ఐడిబిఐ బ్యాంకులో మెజారిటీ వాటాల విక్రయానికి కూడా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో తగినంత కొనుగోలుదారుల ఆసక్తి లేక నిలిచిపోయిన ఈ విక్రయ ప్రక్రియను గతంలో బిడ్లు దాఖలు చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని మళ్లీ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.
ఇటీవల కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పిసిల్లో వాటాలను విక్రయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 80,000 కోట్ల లక్ష్యంతో చేపట్టిన ఈ విక్రయాల్లో భాగంగా గడిచిన ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలోనే ప్రభుత్వం దాదాపు రూ.18వేల కోట్లను సేకరించింది. గత మూడేళ్లలో మొత్తం డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో విదేశీ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వ సంస్థల వాటాల విక్రయాన్ని మోడీ సర్కార్ వేగవంతం చేసిందని స్పష్టమవుతోంది.
సంక్షోభాల సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకుంటూ, దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు మోడీ ప్రభుత్వం ఎనలేని ఆత్రం ప్రదర్శిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాభాల్లో ఉండి, ఏటా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూరుస్తున్న ఎల్‌ఐసిలో వాటాలను విక్రయించడం వల్ల దేశానికి వచ్చే ప్రయోజనమేమిటని నిలదీస్తున్నారు. క్లయిముల పరిష్కారంలో ఎల్‌ఐసి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)