బెంగళూరు : బెంగళూరు శివార్లలోని మడపట్టణ గ్రామంలో ఉన్న ఒక రాతి క్వారీలో, మంగళవారం ఉదయం నలిగిన రాళ్లను లోడ్ చేస్తున్న ట్రాక్టర్ పై పెద్ద బండరాయి పడటంతో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. బెంగళూరు దక్షిణ తాలూకాలోని ఒక స్టోన్ క్రషర్ యూనిట్‌లో ఈరోజు ఉదయం సుమారు 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు వారి పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ క్వారీలో సుమారు 20 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో బీహార్, కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన వలస కార్మికులే పని చేస్తున్నారు. వారు పనిచేస్తున్న సమయంలో 40 అడుగుల ఎత్తుకంటే పైనుండి ఓ పెద్ద బండరాయి వారిపై పడింది. ఈ సమయంలో తమిళనాడుకి చెందిన గోపి అనే కార్మికుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కొంతమంది కార్మికులు ఆ పెద్ద బండరాయిని అక్కడి నుంచి కదిలించి వేరు చేయడానికి ప్రయత్నించే సమయంలో ఒక్కసారిగా దొర్లుకుంటూ జారి కింద పడిపోయింది. పైనున్న కార్మికులు ఆ పెద్ద బండరాయిని కదిలిస్తున్నట్లు తమకు ముందే చెబితే.. ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని గోపి విలేకరులకు చెప్పాడు.
ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని చికిత్స కోసం రాజరాజేశ్వరి ఆసుప్రతికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం.. ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సమాచారం అందిన వెంటనే తావరెకెరె పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా చాలామంది గల్లంతయ్యారని.. బహుశా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్వారీ ఆనందస్వామి అనే వ్యక్తికి చెందినది. ఈ ఘటనలో మృతి చెందినవారు అక్కడే ఏడాదికి పైగా కూలీలుగా పనిచేస్తున్నారు. వారు క్రషర్ యూనిట్ సమీపంలోని తాత్కాలిక నివాసంలో ఉంటున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్వారీ యజమానిని విచారించడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







కామెంట్‌లు (0)