విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ.. వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.









కామెంట్‌లు (0)