ప్రజాశక్తి-భోగాపురం : విజయనగరం జిల్లా భోగాపురంలోని పిఎంశ్రీ ఎపి మోడల్ స్కూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతులను మంత్రులు పరిశీలించారు. ముందుగా జాదు పిఠారా కిట్ ను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్, అసెస్ మెంట్ బుక్ లెట్ ను కేంద్ర మంత్రికి లోకేష్ చూపించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరిశీలించారు. లీప్ డ్యాష్ బోర్డు గురించి మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న స్మార్ట్ కిచెన్ల వ్యవస్థపై రూపొందించిన వీడియోను వీక్షించారు. కడపలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన స్మార్ట్ కిచెన్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం స్పోర్ట్స్ రూమ్, స్కిల్ ల్యాబ్ ను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా పైథాన్ లాంగ్వేజ్ ను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోం వర్క్ అండ్ పీరియాడికల్ అసెస్ మెంట్ అప్లికేషన్ ను గమనించారు. ప్రీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కు సంబంధించిన కౌశల్ బోధ్ పుస్తకాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. స్కూల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. లైబ్రరీలోని పుస్తకాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. అనంతరం మంత్రులు పాఠశాలలోని 9వ తరగతి బి- సెక్షన్ ను పరిశీలించారు. విద్యార్థుల మధ్య కూర్చొని ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అంశంపై రూపొందించిన క్లిక్కర్ వీడియోను వీక్షించారు. ఆ పాఠ్యాంశం గురించి ఉపాధ్యాయురాలు విద్యార్థులకు వివరించారు. క్లిక్కర్ వీడియోకు సంబంధించి ఫ్లిప్ ప్యానల్ ద్వారా క్విజ్ నిర్వహించగా 55 శాతం మంది విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా తరగతి గదిలోని విద్యార్థులతో కేంద్ర మంత్రి సంభాషించారు. అనంతరం ఓ విద్యార్థి పేరు అడగ్గా చాణక్య అని చెప్పాడు. "చాణక్య అంటే ఎవరో తెలుసా? కింగా? కింగ్ మేకరా?" అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కింగ్ మేకర్ అని విద్యార్థి సమాధానం చెప్పాడు. మరో విద్యార్థి రాం ప్రసాద్ ను ఏ భాష సౌకర్యంగా భావిస్తావని ప్రశ్నించగా తెలుగు అని సమాధానం చెప్పాడు. అనంతరం విద్యార్థి స్థాయి ఆధారంగా నేర్చుకునే ‘పాల్’ ల్యాబ్ ను పరిశీలించారు. తమ పేర్లతో రూపొందించిన త్రీడి ప్రింటింగ్ ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఓ విద్యార్థి బహుమతిగా అందజేశాడు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఎస్ పిడి బి.శ్రీనివాసరావు, డిఇఒ మాణిక్యంనాయుడు, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మార్క్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు
ఎపి మోడల్ స్కూలును సందర్శించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 10:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)