థాయ్‌లాండ్ : ఈశాన్య థాయ్‌లాండ్‌లో ఓ పదకొండేళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్కు తీర్థయాత్ర చేస్తున్న సన్యాసుల బృందంపైకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది సన్యాసులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం జరిగింది. రాజధాని బ్యాంకాక్‌కు ఈశాన్యంగా సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్దహాన్ ప్రావిన్స్‌కు చెందిన మొత్తం 35 మంది బౌద్ధ సన్యాసులు ఈ తీర్థయాత్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో మరో 14 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ముక్దహాన్ గవర్నర్ వోరాయన్ బూన్నరత్ తెలిపారు.
కాగా, ఈ ప్రమాదం జరగడానికి సుమారు 30 నిమిషాల ముందు, ఆ బృందం ఉబోన్ రాచతాని ప్రావిన్స్‌కు 260 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించింది. స్థానిక సహాయక బృందమైన 'రువామ్ జై ముక్దహన్ రెస్క్యూ అసోసియేషన్' పంచుకున్న సిసిటివి ఫుటేజ్‌లో రోడ్డు పక్కన ఒకే వరుసలో నడుస్తున్న సన్యాసులను ట్రక్కు వచ్చి ఢీకొట్టడాన్ని కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారకులైన ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బాలల సంరక్షణ అధికారులు వచ్చిన తర్వాత అతన్ని విచారిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)