mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలతో రైతులపై దాడులు తీవ్రతరం : ఎఐకెఎస్‌

1 గంట క్రితం

AIKS calls for nationwide farmers protests
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 05:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలు రైతులపై దాడులను తీవ్రతరం చేశాయని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) మండిపడింది. రైతు సమస్యలపై మోడీ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని వ్యతిరేకిస్తూ ఆగస్ట్‌ 10న దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అలాగే మోడీ ప్రభుత్వం ప్రకటించిన వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించాలని స్పష్టం చేసింది. ఎఐకెఎస్‌కి చెందిన కేంద్ర కిసాన్‌ కమిటీ (సికెసి) ముంబయిలోని వైఎంసిఎ సెంటర్‌లో రెండు రోజులపాటు (జూన్‌ 28,29) సమావేశాలు నిర్వహించింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ నిర్వహించింది. తగ్గుతున్న వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, పంటల బీమా సమస్యలు, భూసేకరణ విధానాలు, ఎరువుల కొరత, రుణమాఫీ పథకాలు, చెరకు ధరలు వంటి అంశాలపై చర్చించారు. అలాగే ఫుడ్‌ కార్ఫోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ) పనితీరును, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాల ప్రభావాలను చర్చించారు.


ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రైతు ఉద్యమానికి కొత్త ఊపునిస్తాయని ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌ ధావలే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రైతులపై దాడులను తీవ్రతరం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్‌- న్యూజిలాండ్‌ ఎఫ్‌టిఎలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని మండిపడ్డారు. భారత్‌, ఇయు(యూరప్‌ యూనియన్‌) మధ్య వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులను పోల్చిచూపారు. 2014-2020మధ్య ఇయు వ్యవసాయ రంగానికి 408.31బిలియన్‌ యూరోల (రూ.43.8లక్ష‍ల కోట్లు) నిధులను కేటాయించిందని అన్నారు. ఇది మొత్తం వ్యయంలో 38 శాతానికి సమానమని అన్నారు. 2021-2027 మధ్య కాలంలో 387బిలియన్‌ యూరోలు (41.5 లక్ష‍ల కోట్లు)కేటాయించిందని, ఇది మొత్తం బడ్జెట్‌లో 31శాతానికి సమానమని అన్నారు. అయితే దీనికి భిన్నంగా మోడీ ప్రభుత్వం తన బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.37 లక్ష‍ల కోట్లు కేటాయించిందని, ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 2.7శాతం మాత్రమేనని అన్నారు. దీంతో రైతులకు ఒనగూరే ప్రయోజనమేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్ల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు.


జులై 28న ఢిల్లీలో జరగనున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జాతీయ సదస్సులో పాల్గొనాలని ఎఐకెఎస్‌ నిర్ణయించింది. అదేవిధంగా జులై 29న ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ పోరాట సదస్సులో కూడా పాల్గొనాలని ఆ సంస్థ తీర్మానించింది. జిల్లా స్థాయిలో ఆగస్ట్‌ 10న ‘జైల్‌ భరో’ నిరసనలో పాల్గొంటామని కమిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. ఎఐకెఎస్‌ ఏర్పడి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. నవంబర్‌ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా గ్రామాల్లో ఎఐకెఎస్‌ జెండాలను ఎగరవేయాలని, అలాగే సమావేశాలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించింది. ఎఐకెఎస్‌ తదుపరి జాతీయ మహాసభ తెలంగాణలోని నల్గొండలో నవంబర్‌ 18 నుండి 21 వరకు జరుగుతుందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైతుల పోరాటాలను ఉధృతం చేయాలని, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్