mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దళితుల శ్మశానవాటికల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం : వి.శ్రీనివాసరావు

2 గంటల క్రితం

srinivasarao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 04:27 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

  • దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

  • కులాన్ని రాజకీయ పావుగా వాడుతున్న పాలక పార్టీలు

  • కుల వ్యవస్థను బలపరిచే మతోన్మాద కుట్రలను ఎదుర్కోవాలి


విజయవాడ : రాష్ట్రంలో దళితుల శ్మశానవాటికల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి మనిషికి చివరి గౌరవమైన శ్మశానవాటికలు కూడా లేక దళితులు తీవ్ర వివక్షకు గురవుతున్నారని, గౌరవప్రదమైన అంత్యక్రియల హక్కు కోసం సిపిఎం కృషి చేస్తుందని అన్నారు. సామాజిక న్యాయంపై మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన జరిగిన సదస్సులో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితులపై వివక్షకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కావాలని 1997`98లో సిపిఎం చేసిన పోరాటం ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశారని తెలిపారు. పున్నయ్య కమిషన్ విచారణలో అనేక అమానవీయ అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిల్లో ముఖ్యమైనది ఇప్పటికీ రాష్ట్రంలో దళితవాడలకు శ్మశానవాటికలు లేవని అన్నారు. నాడు 1235 జివో విడుదల చేసినా అమలు కాలేదన్నారు. ఇటీవల సత్యసాయి జిల్లాలో శ్మశానవాటిక లేకపోవడంతో దళితుడి మృతదేహాన్ని తహశీల్దార్ కార్యాలయం ముందు పెట్టి ఆందోళనకు దిగారని, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటికప్పుడు శ్మశానస్థలాన్ని చూపించారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని, శ్మశానం అనేది ప్రతి మనిషికి చివరిగౌరవంగా భావిస్తారని, బతికనంతకాలం కులవివక్షను ఎదుర్కొంటూ చివరి గౌరవానికి కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దళితుల శ్మశానవాటికల స్థలం కోసం సిపిఎం ఆధ్వర్యాన ఉద్యమం నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, బిజెపి, జనసేన అంతకుముందున్న వైసిపి కులాన్ని రాజకీయపావుగా వాడుకుంటున్నాయని అన్నారు. ముఖ్యంగా రాజకీయ స్వార్థం కోసం అధికారంలో ఉంటున్న పార్టీలు కుల వ్యవస్థను మరింత బలపరచే కుట్రలు చేస్తున్నాయని అన్నారు. అందులో భాగంగానే కులాల వారీగా పదవులు ఇస్తూ, వేర్వేరు సౌకర్యాలను కల్పిస్తూ కులవివక్షను కూడా శాశ్వతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.


కుల నిర్మూలన జరగాలంటే కుల అస్తిత్వం పోవాలని అందుకు కులాంతర వివాహాలే మార్గమని డా॥బి.ఆర్.అంబేద్కర్ చెప్పారన్నారు. కానీ ఇప్పటికీ 11 శాతం మాత్రమే కులాంతర వివాహాలు జరుగుతున్నాయని శ్రీనివాసరావు వివరించారు. ఆధునికత పెరిగినా ఇప్పటికీ వేరే కులస్తులను పెళ్లి చేసుకుంటే పరువు పేరుతో హత్యలకు తెగబడుతున్నారని, ఇటువంటి పరిస్థితులు మారాలన్నారు. అగ్ర కులస్తులకు, దళితులకు ఘర్షణలు జరిగితే పోలీసులతో సహా అందరూ అగ్రకులస్తులకే మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. అగ్రకులాల్లో రాజకీయ నాయకులు చనిపోతే కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నారని, అదే సామాజిక సమస్య అయిన డ్రగ్స్‌పై పోరాడి హత్యకు గురైన నెల్లూరుకు చెందిన పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వారికి మనస్సు రావడం లేదని తెలిపారు. అలాగే ఇటీవల విజయవాడ క్రాంతికుమార్‌తోపాటు పశ్చిమగోదావరి, విశాఖ, కర్నూలులోనూ దళిత యువకులు చనిపోయారని, దీనికి పోలీసుý వేధింపులు, అగ్రకులాల ఆధిపత్యము కారణమని తెలిపారు. లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణ కేసులోనూ కులం ముందుకు వచ్చిందని, ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారి చరిత్రను పరిశీలిస్తే అసలు రౌడీలు ఎవరో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇటీవల అంబేద్కర్ పేరు చెప్పుకుని బిజెపిని కాపాడే నాయకులు బయలుదేరారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఆరఎసఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులను టార్గెట్‌గా చేసుకుని వారిపై కక్షసాధింపులకు దిగుతున్నారని, దళితవాడల్లో ఉండే దేవాలయాల్లోనూ అగ్రకులస్తులు పెత్తనం చేస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని చంద్రబాబు కూడా ప్రశ్నించలేకపోతున్నారని తెలిపారు. గతంలో తనపై బిజెపి ప్రభుత్వం ఆధారపడిందని ప్రచారం చేసుకున్న చంద్రబాబునాయుడు భవిష్యత్ ఇప్పుడు మోడీచేతిలో ఉందని అంటున్నారని అన్నారు. అలాగే క్రిష్టియానిటీలోకి వెళ్లిన హిందువులను తిరిగి హిందూమతంలోకి రావాలని కోరుతున్న వారు, వచ్చిన వారికి ఏ హోదా ఇస్తారో చెప్పాలన్నారు. దళితుల కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక అమలు చేయాలని 1235 జిఓ ఇచ్చారని, దాన్ని ఇప్పటికీ అమలు చేయడం లేదని తెలిపారు. అదే దళితుల భూములు అదానీ, అంబానీకి కట్టబెట్టేందుకు ఇచ్చే జిఓలను మాత్రం వెంటనే అమల్లోకి తెస్తున్నారని అన్నారు. రాముడిపేరు చెప్పి దోచుకుతింటున్నారని, అయోధ్యలో జరిగిన అక్రమాలే దీనికి నిదర్శనమని తెలిపారు. ఒకవైపు సామాజిక న్యాయం లేకుండా చేస్తూ మరోవైపు కులం, మతం పేరుతో దోచుకుతినే పరిస్థితులు పోవాలని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడింది ఒక్క కమÖ్యనిస్టులు మాత్రమేనని, అగ్రనేతలు నంబూద్రిపాద్, పుచ్చలపల్లి సుందరయ్యలాంటి నాయకులు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా దళితులను సమానంగా చూసే పరిస్థితులు రావాలని, దీనికోసం సిపిఎం పోరాడుతుందని తెలిపారు.


ఈ సభకు అధ్యక్షత వహించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ .... హిందువులుగా ఉన్న దళితులకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఇంతకంటే అన్యాయం, సామాజిక వివక్ష మరొకటి ఉండదని తెలిపారు. గ్రామ సీమల్లో ఇప్పటికీ దళితుల పట్ల తీవ్ర వివక్ష సాగుతోందని పేర్కొన్నారు. అకివీడులో గొంతెనమ్మ దేవస్థానం విషయంలో డిప్యూటీ స్పీకర్ పూర్తి అగ్రకుల దురహంకారంతో వ్యవహరించారని, దీనిపై ప్రభుత్వాలు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరించాయని అన్నారు.


సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ .... దళితులు గౌరవంగా బతకాలంటే భూమి కావాలని జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీ చెప్పిందని, ఇప్పటికీ అమలు చేయడం లేదని తెలిపారు. అదే సమయంలో దళితులు దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న భూములను మాత్రం పెద్దలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాను నిధులు వేర్వేరు శాఖలకు మళ్లిస్తున్నారని, కేంద్రం నుండి రావాల్సిన నిధులను కూడా అడగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల డిఫారం భూముల్లో 16 లక్షల ఎకరాల భూములు దళితుల చేతుల్లో ఉన్నాయని, వాటిని కూడా లాక్కుంటున్నారని తెలిపారు. విశాఖ పరిధిలో 6116 ఎకరాల దళితుల భూమిని లాక్కున్నారన్నారు. దీనిపై కోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 2000 మంది దళితులు,పేదల ఇళ్లను కూల్చేస్తే ప్రభుత్వంలో స్పందన లేదని అన్నారు. దళితులపై వివక్షకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణని, ఇటువంటి వాటికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి, ఓ.నల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు తదితరులు మాట్లాడారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్