హైదరాబాద్ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)పై బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీని దేశాన్ని బలహీనపరిచి, విభజించాలని కోరుకునే "వైరస్ - బొద్దింకల" ముఠాగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలోని వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సిజెపి వంటి గ్రూపులు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దేశంలో వైరస్ - బొద్దింకల వంటి పార్టీలు పుట్టుకొస్తున్నాయి. వీరు దేశాన్ని అంతర్గతంగా నిర్వీర్యం చేయాలనుకునేవారు. మనం ఈ వైరస్‌ల పట్ల, బొద్దింకల వంటి మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ ముఠా దేశాన్ని విభజించాలని కోరుకుంటోంది. వీరు ‘తుక్‌డే వాలే గ్యాంగ్’కు చెందినవారు. వీరికి బిజెపి తగిన గుణపాఠం నేర్పుతుంది. బిజెపి కార్యకర్తలందరూ దీనిని ఖచ్చితంగా అమలు చేస్తారు’ అని అన్నారు.
కాగా, మరోవైపు హైదరాబాద్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో నబీన్ సంభాషించారు. ఈ సందర్భంగా జెన్‌జెడ్ తరంపై ఆయన వ్యాఖ్యానించారు. 'జెన్-జెడ్' తరం గురించి చాలా చర్చ జరుగుతోంది. అనేక దేశాల్లో యువత నిరసనలు తెలిపారని, వాటిని 'జెన్-జెడ్ నిరసనలు'గా పేర్కొంటున్నారని కొందరు నాతో చెప్పారు. అయితే, భారతీయ యువత వ్యవస్థకు వ్యతిరేకం కాదు.. వారు దేశాభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారు అని నితిన్ నబీన్ అన్నారు. మరో రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని ఆయన ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రాహుల్ బాబా అని.. ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని ఆయన ఎద్దేవా చేశారు. అయితే బిజెపి కార్యకర్తలు మాత్రం ఫుల్ టైమ్ పొలిషియన్స్ అని నితిన్ అన్నారు.








కామెంట్‌లు (0)