గ్యాస్ స్టౌ, ప్రెజర్ కుక్కర్, మిక్సీ, మైక్రోవేవ్... ఇలా ఒక్కో పరికరం కాలక్రమేణా భారతీయ వంటింట్లో చోటు సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో కొత్త పేరు చేరుతోంది - ఎయిర్ ఫ్రయ్యర్. మహానగరాల్లో కొంతకాలంగా వినియోగంలో ఉన్న ఈ పరికరం ఇప్పుడు చిన్న పట్టణాల్లోనూ అందుబాటులోకి వస్తోంది. అయితే ఇది ఏం చేస్తుంది? ఎలాంటి వంటలు చేయొచ్చు? నిజంగానే నూనె లేకుండా వండుతుందా? ఆరోగ్యానికి మంచిదేనా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి.
ఎయిర్ ఫ్రయ్యర్ అంటే ఏమిటి?
ఎయిర్ ఫ్రయ్యర్ అనేది విద్యుత్‌తో పనిచేసే వంట పరికరం. ఇందులో ఉండే హీటింగ్ ఎలిమెంట్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఒక చిన్న ఫ్యాన్ ఆ వేడి గాలిని ఆహారం చుట్టూ వేగంగా తిప్పుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఆహారం బయటివైపు కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉడుకుతుంది. సంప్రదాయంగా నూనెలో వేయించే వంటకాలను చాలా తక్కువ నూనెతో లేదా కొన్ని సందర్భాల్లో నూనె లేకుండానే తయారు చేయవచ్చు. ఇది అన్నం వండే కుక్కర్ కాదు. పప్పు, చారు, కూరలు కూడా ఇందులో చేయడం సాధ్యం కాదు. ప్రధానంగా పొడి పదార్థాలతో చేసే కొన్ని వంటలకు ఇది అనువుగా ఉంటుంది. బంగాళాదుంప ఫ్రై, ఆలూ టిక్కీ, సమోసా, స్ప్రింగ్ రోల్స్, కట్లెట్లు, పనీర్ టిక్కా, చికెన్, చేపల ఫ్రై, కబాబ్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పల్లీలు, మొక్కజొన్న, కేకులు, బిస్కెట్లు, పిజ్జా, గార్లిక్ బ్రెడ్ వంటి వంటకాలు చేయవచ్చు. పకోడీలు, బజ్జీలు, సమోసాలను మళ్లీ వేడి చేసి కరకరలాడేలా చేయడానికి కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు.
ఎలా ఉపయోగిస్తారు?
వంట పదార్థాలను బాస్కెట్‌లో ఉంచి అవసరమైన ఉష్ణోగ్రత, సమయాన్ని సెట్ చేస్తే సరిపోతుంది. కొన్ని వంటకాలకు ఒకటి లేదా రెండు చెంచాల నూనె చల్లితే మంచి ఫలితం వస్తుంది. మధ్యలో బాస్కెట్‌ను బయటకు తీసి పదార్థాలను ఒకసారి తిప్పితే అన్ని వైపులా సమంగా ఉడుకుతాయి.
ధర ఎంత?
ఎయిర్ ఫ్రయ్యర్లు సామర్థ్యం, సౌకర్యాలను బట్టి వేర్వేరు ధరల్లో లభిస్తున్నాయి.
* చిన్న మోడళ్లు రూ.2500 నుంచి రూ.5,000 వరకు ఉంటాయి.
* డిజిటల్ డిస్‌ప్లే, ముందే అమర్చిన వంట ప్రోగ్రామ్‌లు ఉన్నవి రూ.6,000 నుంచి రూ.10,000 వరకు లభిస్తాయి.
* స్మార్ట్ కనెక్టివిటీ వంటి అదనపు సౌకర్యాలున్న మోడళ్ల ధర రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది.
విద్యుత్ ఎంత ఖర్చవుతుంది?
చాలా ఎయిర్ ఫ్రయ్యర్ల సామర్థ్యం 1,200 నుంచి 2,000 వాట్ల మధ్య ఉంటుంది. ఉదాహరణకు 1,500 వాట్ల పరికరం 20 నిమిషాలు పనిచేస్తే సుమారు అర యూనిట్ విద్యుత్ వినియోగం అవుతుంది.
ఆరోగ్యానికి మంచిదేనా?
ఎక్కువ నూనె అవసరం లేకపోవడం వల్ల మొత్తం కొవ్వు వినియోగం తగ్గే అవకాశం ఉంది. అయితే వండే పదార్థం స్వభావం కూడా అంతే ముఖ్యమైనది. బంగాళాదుంపలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక ఉప్పు లేదా మసాలాలు ఉన్న పదార్థాలు ఎయిర్ ఫ్రయ్యర్‌లో వండినా వాటి పోషక విలువల్లో పెద్ద మార్పు ఉండదు. బంగాళాదుంప వంటి పిండిపదార్థాలను చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అతిగా కాల్చినప్పుడు 'అక్రిలమైడ్' అనే రసాయనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా నూనెలో డీప్ ఫ్రై చేసినా, ఓవెన్‌లో బేక్ చేసినా, ఎక్కువగా కాల్చినా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారం ఏదైనా ముదురు గోధుమరంగు లేదా నల్లగా కాలిపోయే వరకు వండకుండా, బంగారు రంగు వచ్చే వరకు మాత్రమే ఉడికించడం మంచిది.
కొనుగోలు చేసే ముందు...
కుటుంబ సభ్యుల సంఖ్యకు సరిపడే సామర్థ్యం ఉన్న మోడల్‌ను ఎంచుకోవాలి. బాస్కెట్ తీసి శుభ్రం చేయడం సులభమా? వారంటీ ఎంత? విద్యుత్ వినియోగం ఎంత? సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? వంటి అంశాలను కూడా పరిశీలించడం అవసరం. ఈ పరికరం ప్రధాన వంటలకు ప్రత్యామ్నాయం కాదు. కొన్ని రకాల చిరుతిళ్లు, స్నాక్స్, బేకింగ్, గ్రిల్లింగ్ వంటి అవసరాలకు మరో ఎంపికగా ఉపయోగపడుతోంది. కొనుగోలు చేసే ముందు ఇవన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.









కామెంట్‌లు (0)