mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎక్కడికైనా సరే, ఒక్క బ్యాగు చాలు!

2 రోజుల క్రితం

bag
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 07:52 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సెలవులు, సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, విహారయాత్రలు... కారణం ఏదైనా ప్రయాణం మొదలయ్యే ముందు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న "ఏమేం తీసుకెళ్లాలి?" అనేదే. "అది కూడా అవసరం పడొచ్చు", "ఇది కూడా తీసుకెళ్దాం" అంటూ చివరకు రెండు, మూడు బ్యాగులు సిద్ధమవుతాయి. ప్రయాణం పూర్తయ్యే సరికి వాటిలో సగం వస్తువులు అసలు ఉపయోగించలేదని తెలుస్తుంది. అందుకే అనుభవజ్ఞులైన ప్రయాణికులు ఒక కొత్త సూత్రాన్ని చెబుతున్నారు. అది: "ఎంత దూరమైనా, ఎంతకాలమైనా సాధ్యమైనంత వరకు ఒకే బ్యాగుతో ప్రయాణించండి" అని.

ముందుగా జాబితా రాయండి : ఒకే బ్యాగుతో ప్రయాణించడం అంటే చాలా తక్కువ వస్తువులతో సరిపెట్టుకోవడం కాదు. అవసరమైన వాటిని తెలివిగా ఎంపిక చేసుకోవడం. ముందుగా ఒక కాగితం తీసుకుని నిజంగా అవసరమయ్యే వస్తువుల జాబితా రాయాలి. ప్రయాణం స్వభావం, కాలవ్యవధి, గమ్యస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని జాబితా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి వస్తువు గురించి ఒక ప్రశ్న వేసుకోవాలి. అది: "ఇది లేకపోతే ప్రయాణం అసాధ్యమవుతుందా?" అని. సమాధానం "కాదు" అయితే ఆ వస్తువును తీసేయవచ్చు.

​దుస్తులు తగ్గించండి : చాలామంది చేసే పెద్ద పొరపాటు ప్రతి రోజుకు ప్రత్యేక దుస్తులు తీసుకెళ్లడం. వాస్తవానికి ప్రయాణ కాలానికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో దుస్తులు తీసుకుంటే చాలాసార్లు సరిపోతుంది. ఒకదానితో ఒకటి కలిపి ధరించగలిగే రంగులు, నమూనాలు ఉన్న దుస్తులను ఎంచుకుంటే మరింత సౌకర్యంగా ఉంటుంది. లోదుస్తులు, రుమాళ్లు మాత్రం తగినన్ని ఉండాలి. మిగతా దుస్తులను అవసరమైతే ఉతుక్కోవచ్చు.

బట్టలు చుట్టి పెట్టండి : బ్యాగ్ సర్దుకోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. చాలామంది బట్టలను మడతపెట్టి వరుసగా పేర్చుతారు. అయితే బట్టలను చుట్టి పెడితే తక్కువ స్థలం పడుతుంది. చిన్న వస్తువులను ఖాళీ ప్రదేశాల్లో అమర్చుకోవచ్చు. దీనివల్ల బ్యాగ్‌లో స్థలం ఆదా అవుతుంది.

​వస్తువులను విడదీసి సర్దండి : వస్తువులను రకాల వారీగా సర్దుకోవాలి. ఛార్జర్లు, వ్యక్తిగత వస్తువులు, మందులు వంటి వాటిని చిన్న చిన్న సంచులు లేదా పౌచ్‌లలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే కావాల్సిన వస్తువు కోసం మొత్తం బ్యాగ్‌ను వెతకాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.

​చిన్నవే ఉపయోగించండి : పెద్ద షాంపూ సీసా బదులు షాంపూ సాచెట్లు తీసుకెళ్లవచ్చు. పెద్ద టూత్‌పేస్ట్, పెద్ద సబ్బుల బదులు బయట గడిపే రోజుల సంఖ్యను బట్టి చిన్న పరిమాణంలో ఉన్నవి లేదా శాంపిల్ ప్యాక్‌లు ఉపయోగించవచ్చు. పెద్ద తువ్వాలు బదులు త్వరగా ఆరిపోయే తేలికపాటి తువ్వాలు వాడవచ్చు. ప్రయాణం కోసం ప్రత్యేకంగా కొనుగోళ్లు చేయడం కంటే ఇప్పటికే ఉన్న వస్తువులను ఉపయోగించుకోవడం మంచిది.

బరువైనవి ధరించండి : జాకెట్, స్వెట్టర్, షూస్ వంటి వాటిని బ్యాగ్‌లో పెట్టడం కంటే ధరించడమే మంచిది. దీంతో బ్యాగ్‌లో మరింత స్థలం మిగులుతుంది. తరచుగా అవసరమయ్యే వస్తువులను బ్యాగ్ పైభాగంలో ఉంచాలి. టికెట్లు, గుర్తింపు కార్డులు, మొబైల్ ఛార్జర్, మందులు వంటి వాటిని సులభంగా అందుకునే చోట పెట్టుకోవాలి.

భయాన్ని ప్యాక్ చేయొద్దు : అనుభవజ్ఞులైన ప్రయాణికులు చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే: "ఒకవేళ అవసరం పడితే?" అనే భయాన్ని తగ్గించుకోండి అని. ఇప్పుడు దాదాపు ప్రతి పట్టణంలో మెడికల్ షాపులు, దుస్తుల దుకాణాలు, సాధారణ అవసరాల వస్తువులు లభిస్తాయి. ఏదైనా మరిచిపోయినా చాలా సందర్భాల్లో అక్కడే కొనుగోలు చేయవచ్చు. అందువల్ల అవసరం అనుకున్నవి తప్ప అవసరపడతాయేమోనన్న వస్తువులు వెంట మోసుకెళ్లాల్సిన అవసరం లేదు.

​ఒకే బ్యాగుతో ప్రయాణించడం అంటే - సామాను తగ్గించుకోవడం మాత్రమే కాదు. అవసరమైనదే తీసుకోవడం, అనవసరమైనదాన్ని వదిలేయడం అనే జీవన పాఠాన్ని తెలుసుకోవటం కూడా! ప్రయాణం విలువ సామాన్లలో కాదు, అనుభవాల్లో ఉందని తెలియజేస్తుంది. అందుకే ఇప్పుడు అనుభవజ్ఞులైన ప్రయాణికులు ఒక మాట చెబుతున్నారు – "ప్రయాణాన్ని తేలిక చేయాలంటే ముందుగా బ్యాగ్‌ను తేలిక చేయండి." అని.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్