ఒక భాషా సంస్కృతి నిలబడాలన్నా, రాబోయే తరాలకు ఆ వైభవం సజీవంగా అందాలన్నా నిరంతర పరిశోధన, సాక్ష్యాధారాలతో కూడిన విమర్శనాత్మక దృష్టి అత్యంత ఆవశ్యకం. ఒడిశా సరిహద్దు ప్రాంతమైన బరంపురంలో నివసిస్తూ అక్కడి నుంచే తెలుగు భాష, సాహిత్యాలపై పరిశోధన సాగిస్తున్న డా. తుర్లపాటి రాజేశ్వరి కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత. గత మూడు దశాబ్దాలుగా వివిధ వేదికలపై ఆమె చేసిన ప్రసంగాలు, రాసిన పరిశోధనా వ్యాసాల సంకలనమే ‘సహృదయ వ్యాసావళి’. ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ముందుమాటలో పేర్కొన్నట్లు, ఈ గ్రంథం కేవలం వ్యాసాల సంకలనం మాత్రమే కాదు; తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక కోణాలను పరిశోధనాత్మక దృష్టితో పరిచయం చేసే గ్రంథం.
ఈ గ్రంథంలో రచయిత్రి ప్రదర్శించిన పరిశోధనా దృష్టికి చారిత్రక వ్యాసాలే ప్రధాన నిదర్శనం. "తెలుగు నేల ప్రాచీనత - మానవ జీవన ప్రస్థానం - పురావస్తు ఆధారాలు" అనే వ్యాసంలో తెలుగు ప్రాంతంలో మానవ నివాస చరిత్ర అత్యంత ప్రాచీనమైనదనే విషయాన్ని పురావస్తు ఆధారాలతో వివరించారు. పురావస్తు శాస్త్రవేత్త సంకాలియా పరిశోధనలను ఉటంకిస్తూ సుమారు లక్షన్నర సంవత్సరాల క్రితమే ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లో ప్రాచీన శిలాయుగ మానవుడి స్థావరాలు ఉండేవని పేర్కొన్నారు. గూడెం, రేణిగుంట, నాగార్జునకొండ ప్రాంతాల పురావస్తు ఆధారాలను ప్రస్తావిస్తూ తెలుగుజాతి ప్రాచీనతను వివరించారు. "తెలుగు జాతి - ఆంధ్ర జాతి: ప్రాచీనత", "తెలుగు భాష ప్రాచీనత" వ్యాసాలలో 'ఆంధ్ర', 'తెలుగు', 'తెనుగు' పదాల మూలాలను ప్రామాణికంగా చర్చించారు. ఐతరేయ బ్రాహ్మణంలో 'ఆంధ్రులు' అనే ప్రస్తావనను ఉటంకిస్తూ క్రీ.పూ. 7వ శతాబ్దానికే ఆంధ్ర జాతి ఉనికిలో ఉందనే అభిప్రాయాన్ని వివరించారు. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టలేదని, అది స్వతంత్ర అస్తిత్వం గల ప్రాచీన ద్రావిడ భాష అని స్పష్టం చేశారు. క్రీ.శ. 1వ శతాబ్దపు హాలుని ‘గాథాసప్తశతి’లో కనిపించే అచ్చతెలుగు పదాలను, క్రీ.శ. 2వ శతాబ్దం నాటి అమరావతి ‘నాగబు’ శబ్దాన్ని, క్రీ.శ. 575 నాటి రేనాటి చోళుల ‘ఎఱ్ఱగుడిపాడు శాసనం’ను విశ్లేషిస్తూ నన్నయకు ముందే తెలుగు భాష ప్రజల వాడుకలో ఎంత సమృద్ధిగా ఉందో చూపించారు.
ఆంధ్ర సాహిత్య చరిత్రలోని ముఖ్య ఘట్టాలను, కవుల సాహిత్య వైశిష్ట్యాన్ని రచయిత్రి విశ్లేషణాత్మకంగా చర్చించారు. పురాణయుగపు కవుల నుంచి ఆధునిక కవుల వరకు సాగిన పరిణామాన్ని వివరిస్తూ, వేములవాడ భీమకవి వంటి కవుల చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. దేశభక్తి, జాతీయత భావనలు తెలుగు సాహిత్యంలో ఎలా పరిణామం చెందాయో వివరిస్తూ రాయప్రోలు సుబ్బారావు గారి "ఏ దేశమేగినా...", గురజాడ అప్పారావు గారి "దేశమంటే మట్టి కాదోయ్..." గేయాల నుంచి అల్లూరి సీతారామరాజు విప్లవ స్ఫూర్తి వరకు విస్తరించిన జాతీయ చైతన్యాన్ని చర్చించారు. "విశ్వకవి - మహాకవి ఇద్దరూ ఇద్దరే!" అనే తులనాత్మక వ్యాసంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ‘నైబేద్యం’లోని ప్రార్థనా గీతానికి, గురజాడ ‘ముత్యాల సరాలు’లోని దేశభక్తి భావజాలానికి మధ్య ఉన్న అంతస్సూత్రాన్ని విశ్లేషించారు. సాహిత్య విమర్శలో మహిళా చైతన్యాన్ని, నవ్య సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబించే వ్యాసాలు కూడా ఈ గ్రంథంలో ప్రాధాన్యం పొందాయి. "మహిళా విముక్తిలో ఓ అంకం కన్యాశుల్కం - అదృశ్యంగా నాటకాన్ని నడిపించిన సుబ్బి" అనే వ్యాసంలో గురజాడ అప్పారావు గారి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ఒక కొత్త విమర్శనా కోణంలో పరిశీలించారు. రంగస్థలంపై కనిపించని ‘సుబ్బి’ పాత్ర నాటక ముగింపును, స్త్రీ విముక్తి భావనను ఎలా ప్రభావితం చేసిందో విశ్లేషించారు. "ఆధునిక తెలుగు కవిత్వం - స్త్రీవాదం" వ్యాసంలో స్త్రీ అస్తిత్వ పోరాటాలను తార్కికంగా చర్చించారు.
ఒడిశా ప్రాంతీయ తెలుగు సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని చర్చించిన వ్యాసాలు ఈ గ్రంథానికి మరో ప్రత్యేకత. "ఈ బరంపురం వాడుక భాషోద్యమానికి పట్టం కట్టింది!", "తోకచుక్కకు ముందే బరంపురం వేగుచుక్క" వంటి వ్యాసాలలో గాధే రాఘవరావు డైరీలు, 1909 నాటి ‘వివేకవతి’ పత్రిక ఆధారాలను వెలికితీసి చారిత్రక విషయాలను నమోదు చేశారు. గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకం కంటే ముందే బరంపురంలో అస్పృశ్యత నిర్మూలన కోసం సహపంక్తి భోజనాలు నిర్వహించిన గాధే రాఘవరావు కృషిని ప్రస్తావించారు. గిడుగు రామమూర్తి వాడుక భాషోద్యమానికి బరంపురం ఎలా కేంద్రబిందువుగా మారిందో వివరించారు. బరంపురం, కటక్, భువనేశ్వర్ వంటి నగరాల్లో తెలుగు భాషను, నాటకరంగాన్ని పరిరక్షిస్తున్న తెలుగు సంస్థల సేవలను నమోదు చేస్తూ ఒడిశా-ఆంధ్ర సాంస్కృతిక అనుబంధాన్ని వివరించారు. డా. తుర్లపాటి రాజేశ్వరి రచనా శైలి సరళంగా పరిశోధనాత్మక లోతుతో కూడి ఉంటుంది. భాషాశాస్త్రం, చరిత్ర, పురావస్తు వంటి క్లిష్టమైన అంశాలను కూడా సాధారణ పాఠకుడికి అర్థమయ్యే రీతిలో వివరించడం ఈ వ్యాసాల విశేషం. ప్రతి వ్యాసం వెనుక విస్తృత అధ్యయనం, ప్రామాణిక ఆధారాలు కనిపిస్తాయి. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సాంస్కృతిక అస్తిత్వంపై ఆసక్తి ఉన్నవారికి ‘సహృదయ వ్యాసావళి’ ఉపయోగకరమైన గ్రంథంగా నిలుస్తుంది.
– మర్రాపు వసుంధరా దేవి
94414 67660








కామెంట్‌లు (0)