ఆధునిక జీవితంలోని సంక్లిష్టతలను సరళమైన భాషలో, హృద్యమైన శైలిలో, సామాజిక బాధ్యతతో చిత్రించిన కథకుల్లో డా. డి.వి.జి. శంకరరావు ఒకరు. వైద్య వృత్తిలో నిమగ్నమై ఉన్నప్పటికీ, సమాజాన్ని పరిశీలించే సున్నితమైన దృష్టి, జీవన విలువలపై నమ్మకం ఆయన వెలువరించిన ‘డి వి జి కథలు’లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సంపుటిలోని కథలు కల్పిత ప్రపంచంలో విహరించవు. చుట్టూ కనిపించే మనుషులు, ప్రతిరోజూ ఎదురయ్యే సంఘటనలు, మనసును తాకే అనుభవాలు, సమాజంలోని విరుద్ధ ధోరణులే కథలుగా రూపుదిద్దుకున్నాయి. రచయిత తన అనుభవాలను, పరిశీలనలను కథా వస్తువులుగా మలచిన తీరు కథలను పాఠకుడికి మరింత చేరువ చేస్తుంది.
“ప్రయాణం” కథలో విదేశాల్లో స్థిరపడిన వ్యక్తి జీవితాన్ని చిత్రిస్తూ, చివర్లో కులాభిమానంతో జరిగే సన్మానాన్ని తిరస్కరించడం ద్వారా రచయిత కులవాద ధోరణిపై తన నిరసనను వ్యక్తం చేస్తారు. “దారి తెలిసినంత మాత్రాన సరిపోదు, సరైన దిశలో ప్రయాణం జరగాలి” అనే సందేశం కథకు బలాన్నిస్తుంది. “దైవం” కథ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానాన్ని ప్రశ్నిస్తే, “ప్రభావం” కథ విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమనే ఆశావాదాన్ని వ్యక్తం చేస్తుంది. డా. శంకరరావు కథల్లో వ్యంగ్యం ఎవ్వరినీ గాయపరిచేది కాదు; ఆలోచింపజేసేది. “పంకజం” కథలో వినిమయ సంస్కృతిపై వ్యంగ్యాన్ని, “పిచ్చోడి నవ్వు” గల్పికలో ప్రకృతి వనరుల దుర్వినియోగంపై హెచ్చరికను సమర్థంగా వ్యక్తం చేశారు. “నెట్‌వర్క్” కథ సోషల్ మీడియా సంబంధాల వెనుకనున్న శూన్యతను ఆవిష్కరిస్తూ, నిజ జీవితంలో కష్టసుఖాలు పంచుకునేవారే అసలైన మిత్రులని గుర్తుచేస్తుంది. “రాజద్రోహమా... అంతకు మించి!” కథలో రాజకీయ నాయకత్వం, ప్రజాధనం, ఉచిత పథకాల దుష్పరిణామాలపై రచయిత తన అభిప్రాయాలను వెల్లడించారు.
రచయిత వైద్యునిగా ఉన్న అనుభవం కొన్ని కథలకు ప్రత్యేకమైన విశ్వసనీయతను తీసుకొచ్చింది. “నేనూ... నాగరాజు” కథలో “స్లీప్ పెరాలిసిస్”, “ఇంక్యుబస్ ఫెనామినా” వంటి అరుదైన మానసిక-శారీరక పరిస్థితులను కథారూపంలో పరిచయం చేశారు. వైద్య విజ్ఞానాన్ని కథా కళతో మేళవించిన ప్రయత్నంగా ఈ కథ నిలుస్తుంది. మరోవైపు “మళ్లీ నా కోసం పుట్టవా!” తండ్రి–కొడుకుల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించిన రచన. “ఈసారి నా కూతురిగా పుట్టు” అనే వాక్యం కథలోని భావోద్వేగానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. డా. శంకరరావు భాష సరళంగా, కథనం సహజంగా ఉంటుంది. క్లిష్టమైన పదజాలం, అలంకారాల ఆర్భాటం లేకుండానే పాఠకుడిని కథలోకి తీసుకెళ్లగలుగుతారు. హాస్యం, వ్యంగ్యం, భావోద్వేగం, సందేశం – ఈ నాలుగు అంశాలను సమతుల్యంగా మేళవించడం ఆయన కథల బలం. వైద్యుడు శరీర రోగాలను నయం చేసినట్లే, రచయిత సమాజంలోని ఈర్ష్య, స్వార్థం, నిర్లక్ష్యం, కులాభిమానం, విలువల సంక్షోభం వంటి సామాజిక రుగ్మతలను కథల ద్వారా ప్రశ్నిస్తారు. అందువల్ల ‘డి వి జి కథలు’ కేవలం కథల సంపుటి మాత్రమే కాదు; మన సమాజానికి అద్దం పట్టే రచనగా నిలుస్తుంది. ఇందులోని కథలు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తాయి. మానవీయ విలువలు, కుటుంబ బంధాలు, విద్య ప్రాముఖ్యత, ప్రకృతి పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలను పాఠకుడి మనసులో నిలిపే ప్రయత్నం చేస్తాయి. సమకాలీన తెలుగు కథా సాహిత్యంలో ఈ కథాసంపుటి ఒక విలువైన చేరికగా చెప్పవచ్చు.
- ఆచార్య కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి
95387 42224








కామెంట్‌లు (0)