mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాగర మద్యం!

1 రోజు క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సముద్ర తీరంలో కూర్చొని

బాధల ఊసుల్ని గాలిలో ఎగరేసి,

మనసుల్ని ఇసుకంత తేలికపరచుకుందామంటే

భయమేస్తోంది ఇప్పుడు...​

జంటలు జంటలుగా చేయి చేయి కలుపుకొని,

చెలియలికట్టపై నడుస్తూ

శరీరాన్ని చల్లపరచుకుందామంటే

భయమేస్తోంది ఇప్పుడు...

​సాయంసంధ్యా వేళలో కెరటాల హోరులో

పిల్లల కేరింతల దృశ్యాలు చూద్దామని,

కుటుంబంతో బీచ్‌కు వెళ్దామంటే

భయమేస్తోంది ఇప్పుడు...

సేదతీరుదామని ఊతకర్ర పట్టుకొని,

చల్లగాలి తోడుతో నాలుగు అడుగులు వేద్దామంటే

భయమేస్తోంది ఇప్పుడు...​

జీవితాల్లో మాయమవుతున్న

స్వేచ్ఛను, హాయిని, మనశ్శాంతిని

ఓ గంటైనా ఆ ప్రశాంత తీరంలో అనుభవిద్దామంటే

భయమేస్తోంది ఇప్పుడు...

ఇప్పుడక్కడ కెరటాలు మత్తులో తూలి

ఎవరిని ఎప్పుడు లాక్కుపోతాయో తెలియదు

ఇసుకతిన్నెలు సంస్కారహీనమై

ఎప్పుడు ఎవరి కళ్లలో దుమ్ముకొడతాయో తెలియదు

అక్కడ సంచరించే మత్తుమూల్గులు

ఎప్పుడు మృగాలై వెంటాడుతాయో తెలియదు!

బీచ్ రోడ్లు జూగుతున్నాయి

బీచ్ పార్కుల్లో విషసర్పాలు తిరుగుతున్నాయి

బీచ్‌లు కుసంస్కార కరాళనృత్య వేదికలౌతున్నాయి

అక్కడ సహజ ఆహ్లాదం మాయమై,

వికృత చేష్టల పైశాచిక పవనాలు వీస్తున్నాయి

అది మత్తువాసనల తీరమౌతోంది

భద్రత లేని ఘోరమౌతోంది!

వ్యాపారం కోసం, సంపదసృష్టి కోసం

భద్రతా దీపం గాల్లోపెట్టి

కావాలంటున్నారు ఇప్పుడు కేసినోలు, బీచ్ షేక్స్‌లు!

జాగ్రత్తమ్మ... జాగ్రత్త...!

సముద్రతీరం చీమలు దూరని చిట్టడవవుతున్న వేళ

ఇసుకతిన్నెల్లో గాజుముళ్లు ఏరుకుంటూ నడవాలి ఇప్పుడు

మన భద్రత మన బాధ్యతే మరి

జాగ్రత్త సుమా...!​


- బొడ్డ కూర్మారావు

99595 00360


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్