mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుద్ధాల్లో ఓడిపోతున్న బాల్యం!

6 రోజుల క్రితం

Childhood losing in wars
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 05:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యం యుద్ధాల కారణంగా అతలాకుతలం అవుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.72 కోట్ల మంది పిల్లలు యుద్ధాలు, హింస కారణంగా నిర్బంధ వలసదారులుగా మారారు. 47.3 కోట్ల మందికి పైగా పిల్లలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు యుద్ధం లేదా దాని ప్రభావిత ప్రాంతంలోనే పెరుగుతున్నారని యునిసెఫ్‌ హెచ్చరిస్తోంది. ప్రపంచ జనాభాలో పిల్లల వాటా 29 శాతం కాగా, యుద్ధ ప్రాంతాల్లో బాధితులుగా మారుతున్న వారిలో పిల్లల సంఖ్య 39 శాతంగా ఉంది. యుద్ధాల ప్రభావం పిల్లల మీద ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

​ ఒకప్పుడు యుద్ధాలు సైనికుల మధ్య జరిగేవి. ఇప్పుడు నగరాల మధ్య జరుగుతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో భారీ బాంబులు, క్షిపణులు వినియోగిస్తున్నారు. ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, శరణాలయాలు కూడా దాడుల లక్ష్యాలుగా మారుతున్నాయి. గాజా, ఉక్రెయిన్‌, సూడాన్‌, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, సోమాలియా, నైజీరియా, హైతీ, ఇరాన్‌ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. 2026 మార్చి 5న ఇరాన్‌లోని మినాబ్‌ పట్టణంలో ఒక బాలికల ప్రాథమిక పాఠశాలపై అమెరికా జరిపిన దాడి క్రూరత్వానికి చిహ్నంగా నిలిచింది. ఈ దాడిలో 169 మంది విద్యార్థినులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల తరగతి గదులు కూడా యుద్ధ భూములుగా మారుతున్నాయనే భయానక వాస్తవాన్ని ఈ ఘటన ప్రపంచానికి గుర్తు చేసింది.

​ పిల్లల జీవితంలో పాఠశాల కేవలం చదువు చెప్పే స్థలం కాదు; అది భద్రతకు, ఆశలకు, భవిష్యత్తుకు ప్రతీక. కానీ నేడు విద్యాసంస్థలే లక్ష్యాలుగా మారుతున్నాయి. గ్లోబల్‌ కోలిషన్‌ టు ప్రొటెక్ట్‌ ఎడ్యుకేషన్‌ ఫ్రమ్‌ అటాక్‌ నివేదిక ప్రకారం - 2024–25 కాలంలో ప్రపంచవ్యాప్తంగా 8,566 విద్యాసంస్థలపై దాడులు నమోదయ్యాయి. ఇది 2022–23తో పోలిస్తే 40 శాతానికి పైగా పెరుగుదల. ఈ దాడుల్లో 10,600 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరణించారు, గాయపడ్డారు. గాజాలో బాంబుల పేలుళ్ల వల్ల చేతులు, కాళ్లు కోల్పోయిన పిల్లల సంఖ్య ఆధునిక చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. యుద్ధాల ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5.2 కోట్ల మందికి పైగా పిల్లలు చదువుకు దూరమయ్యారు. గాజా, సూడాన్‌ ప్రాంతాల్లో లక్షలాది మంది పిల్లలు రెండేళ్లుగా పాఠశాల ముఖం చూడలేదు. ఉక్రెయిన్‌, సిరియా, కాంగో వంటి దేశాల్లో వేలాది పాఠశాలలు ధ్వంసమయ్యాయి. సైనిక స్థావరాలుగా మారాయి.

ఆరోగ్య వ్యవస్థల పతనం

లాన్సెట్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం - యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ముందుగా కుప్పకూలేది మాతాశిశు ఆరోగ్య వ్యవస్థ. ఫలితంగా ముందస్తు ప్రసవాలు, ప్రసవ సమయంలో ఆక్సిజన్‌ అందక మరణాలు, నవజాత శిశువుల్లో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో నివారించగలిగే అనేక మరణాలు యుద్ధాల కారణంగా మళ్లీ పెరుగుతున్నాయి. టీకా కార్యక్రమాలు నిలిచిపోవడం మరో ప్రధాన సమస్య. ఫలితంగా పిల్లలు మళ్లీ నివారించగలిగే వ్యాధులకు బలవుతున్నారు.

అలాగే, యుద్ధ ప్రాంతాల్లో కోట్లాది మంది పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నారు. యుద్ధం, వలస, ఆహార కొరత కలిసి పిల్లల శారీరక వికాసాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. అనేక మంది పిల్లలు కుటుంబ సభ్యులను కోల్పోయి, మరికొందరు తల్లిదండ్రుల నుంచి విడిపోయి శిబిరాల్లో జీవిస్తున్నారు. యుద్ధాలు లక్షలాది పిల్లల బాల్యాన్ని, భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయి. ఈ దుస్థితి, దుర్మార్గం, దుఃఖమూ అంతరించినప్పుడే ఈ ప్రపంచం నిజమైన మానవీయ ప్రపంచంగా మారుతుంది.

- ఫీచర్స్‌ అండ్‌ ‌పాలిటిక్స్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్