mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అధ్యయనానికి మారు పేరు కొరటాల

2 గంటల క్రితం

satyanarayanakoratala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

నేడు 20వ వర్థంతి

పురుషులలో పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కమ్యూనిస్టులలో కూడా వేరుగా కనిపించే ధన్యజీవులలో ఒకరు కొరటాల సత్యనారాయణ. పుట్టింది మోతుబరి రైతు కుటుంబం, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గ్గొన్న కుటుంబ, బంధువుల నేపథ్యంలో తన వర్గ స్వభాన్ని వదులుకొని పీడిత ప్రజలకు బాసటగా నిలిచిన అనేక మంది కమ్యూనిస్టులలో ఆయన ఒకరు. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా అనుచితమైన డిటెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా హైస్కూలులో జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబరు 24న జన్మించిన కొరటాల 2006 జులై ఒకటిన అనారోగ్యంతో మరణించారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలోనూ, తరువాత 1975లో విధించిన అత్యవసర పరిస్థితిలో నాలుగేళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులపై నాటి మద్రాస్‌ ప్రావిన్సులో భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో తొలుత బ్రిటీష్‌ పోలీసులు, తరువాత కాంగ్రెస్‌ పాలకుల నిర్బంధకాండ, అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లకు వేలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులు బలయ్యారు. ఆ క్రమంలో 1948లో అరెస్టయి బళ్లారి, కడలూరు జైళ్లలో మూడేళ్లకు పైగా ఉన్నారు. ఆ సమయంలో జైలు అధికారుల నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురై ఆకస్మికంగా ఆకలి మందగించటం...ఆ తరువాత తిరిగి కోలుకొనే ఒక అరుదైన జబ్బుకు గురై జీవితాంతం అనుభవించారు.

ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో గుంటూరు జిల్లాకు ప్రాధాన్యత ఉంది. సిపిఐ(ఎం)లో నలుగురు పొలిట్‌ బ్యూరో సభ్యులను అందించింది. వారిలో కొరటాల ఒకరు. రేపల్లె తాలూకా నేత నుంచి అగ్రస్థానానికి ఎదిగిన క్రమంలో ప్రజా సమస్యలను అధ్యయనం చేయటం, ఉద్యమాలకు నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. సిపిఐ లో చీలిక కంటే నగ్జలైట్ల విచ్ఛిన్నం గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో హాని చేసింది. అక్కడక్కడా ఉన్న సిపిఎం సభ్యులు, కార్యకర్తలను సమీకరించి తిరిగి ఒక రూపానికి తీసుకురావటంలో కొరటాల ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన మరణించి రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రపంచ, భారత కమ్యూనిస్టు ఉద్యమాలలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎదుర్కొంటున్న సవాళ్ల పూర్వ రంగంలో ఆ కామ్రేడ్‌ నుంచి నేటి పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు, నేతలు, పత్రికా రంగంలో ఉన్నవారు నేర్చుకొని ఆచరించాల్సిన అనుభవాలు అనేకం ఉన్నాయి. అదే ఆయనకు ఘన నివాళి.

స్థానిక నేతగా ఉన్న సమయంలో చల్లపల్లి జమిందారీ భూములు, బంజరు భూముల సమస్యలపై జరిగిన పోరాటాలలో కొరటాల భాగస్వామి. నగ్జల్స్‌ విచ్ఛిన్నం తరువాత జిల్లా కేంద్రంలో బాధ్యతలు తీసుకొని పని చేస్తున్న సమయంలో రైతాంగం ముఖ్యంగా వాణిజ్య పంటలను సాగు చేసే వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రీకరించి పని చేశారు. సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ అధిక వాడకం కారణంగా తలెత్తిన తెల్లదోమ సమస్యతో పత్తి రైతాంగం ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడటాన్ని స్థానిక ప్రజా సంఘాలు, పార్టీ కార్యకర్తలు ఒక సాధారణ అంశంగా పరిగణించిన తరుణంలో ప్రకాశం జిల్లాలో పర్యటించి ఆత్మహత్యల కారణాలను మీడియా దృష్టికి తేవటంలో కొరటాల ముందున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కరువుతో అల్లాడుతున్న బడుగు జీవులకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు అవసరమైన నిధులు, వస్తు సేకరణలో కూడా ఆయనది ప్రముఖ పాత్ర. గోదావరి వరదలకు ఉభయ గోదావరి జిల్లాలు అస్తవ్యస్థమైనపుడు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ మూడు ఉదంతాలలో కొరటాలతో పాటు ఒక జర్నలిస్టుగా ఆ ప్రాంతాలను సందర్శించి సమస్యలను అవగాహన చేసుకొనేందుకు ఈ వ్యాస్తకర్తకు ఎంతో ఉపయోగపడింది. రైతు సంఘ రాష్ట్ర నేతగానే కాదు, వ్యవసాయ కార్మిక సంఘ నేతగా కూడా ఆయన పని చేశారు. 1980 దశకంలో ప్రవేశించిన వ్యవసాయ పనుల కాంట్రాక్టు విధానం వ్యవసాయ కార్మికులకు ఎలా నష్టదాయకమో కూడా ఆయన అధ్యయనం చేసి హెచ్చరించారు. అంతేకాదు చేనేత కార్మికుల సమస్యల మీద కొరటాలకు ఉన్న పట్టు ఎలాంటిదంటే ఆ సామాజిక తరగతికి చెందిన వారు ఆయనను తమవాడిగా భావించారంటే అతిశయోక్తి కాదు. వారి సమస్యలపై అదే సామాజిక తరగతికి చెందిన కొందరు పేరు ప్రఖ్యాతులున్న నాయకులతో సమంగా కొరటాల పనిచేశారు. ఇలా వివిధ రంగాలలో పనిచేసిన కమ్యూనిస్టులు చాలా అరుదని కూడా చెప్పవచ్చు. కమ్యూనిస్టులు దళితులపై జరుగుతున్న కులవివక్ష అంశాన్ని పట్టించుకోవటం లేదంటూ అంబేద్కరిస్టులు చేస్తున్న ప్రచారదాడుల పూర్వ రంగంలో దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఏర్పాటుకు చొరవ తీసుకున్నది కొరటాల అనే అంశం నేటి తరాలకు చాలా మందికి తెలియదు.

ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌గా కూడా కొరటాల ప్రముఖ పాత్ర పోషించారు. ఎడిషన్ల విస్తరణ, ఒక సమగ్ర పత్రికగా దాన్ని రూపొందించాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఎంతగానో తపించారు. విద్యార్థి ఉద్యమ దశ నుంచి దశాబ్దాల పాటు కొరటాలతో ఏర్పడిన వ్యక్తిగత, ఉద్యమ సాన్నిహిత్యం ఈ వ్యాసకర్త జర్నలిస్టుగా ఎదగటానికి తోడ్పడింది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గుంటూరు జిల్లా పరిషత్‌ సభ్యులుగా కొరటాల, పుతుంబాక వెంకటపతి సమావేశాలలో లేవనెత్తిన అంశాలను వార్తలుగా పంపటం సాధారణ విషయం.

ఆ సమావేశాలకు అందచేసే ఎజెండాను అధ్యయనం చేయటం ద్వారా ప్రభుత్వ పథకాలలో ఉన్న డొల్లతనాన్ని అర్ధం చేసుకొనేందుకు జిల్లా కేంద్రాలలో పని చేసే ప్రతి జర్నలిస్టుకు ఎంతో అవసరం. ఇది వ్యక్తిగత సమస్య కాదు, ప్రజల కోసం పని చేసే పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలకు కేవలం నేతల ఆరోపణలు ప్రత్యారోపణల మీద కేంద్రీకరించటం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి జనం ఎజెండాను ముందుకు తేవాల్సి ఉంది. కమ్యూనిస్టు ఉద్యమంలో సంభవించిన విచ్ఛిన్నాలతో యువ కార్యకర్తలు, నాయకులు సిపిఐ(ఎం)కు దూరమయ్యారు. పునర్‌ నిర్మాణ సమయంలో నేతలకు, కొత్తగా ఉద్యమంలోకి వచ్చిన విద్యార్ధులు, యువకులకు ఎంతో వయసు వ్యత్యాసం ఉంది. దాన్ని అధిగమించి యువతతో మమేకం కావటంలో కమ్యూనిస్టు అగ్రనేతలలో కొరటాలకు మరొకరు సాటి లేరంటే అతిశయోక్తి కాదు. ఐదు పదుల వయస్సు దాటిన తరువాత రెండు పదులలోపు మాలాంటి యువకులతో 'ఏరా బాబూ...' అంటూ భుజాల మీద చేయి వేసి మాట్లాడే నేతలు ఈ రోజుల్లో ఎందరు కనిపిస్తారు? 1970-80 దశకాల్లో అలాంటి నేతలలో కొరటాల తీరే వేరు. ఇలా కొరటాల జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది!

- ఎం. కోటేశ్వరరావు​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్