ఎనిమిది జట్ల మధ్యే పతకాల పోటీ
ఐసిసి ర్యాకింగ్స్ ఆధారంగా టాప్ జట్లకు మాత్రమే
అర్హత ప్రక్రియకు ఆమోదం తెలిపిన ఐఒసి
న్యూయార్క్: దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు లభించిన సంగతి తెలిసిందే. 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి) అర్హత ప్రక్రియను అధికారికంగా ఆమోదించింది. దీంతో భారత పురుషుల, మహిళల జట్లకు నేరుగా ఒలింపిక్స్ బెర్త్ లు దక్కాయి. అయితే, టోర్నమెంట్‌లో ఎక్కువ జట్లు కాకుండా ఒక్కో విభాగంలో కేవలం 6 జట్లు మాత్ర మే పాల్గొనేలా ఐఒసి నిబంధనలు విధించింది. పురుషుల, మహిళల విభాగాల్లో టి20 ఫార్మాట్‌లో మాత్రమే క్రికెట్ పోటీలు జరగనున్నాయి.
పురుషుల విభాగం క్వాలిఫికేషన్ రూల్స్..
డైరెక్ట్ క్వాలిఫికేషన్ (4 బెర్త్‌లు): ఐసిసి టి20 ర్యాంకుల ఆధారంగా నాలుగు జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆ టాప్-4 జట్లను నాలుగు వేర్వేరు ఖండాల నుంచి టాప్ ర్యాంకుల్లో నిలిచిన జట్లకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఇందుకోసం ఈ ఏడాది చివరి నాటికి, (2026 డిసెంబర్ 31) ఐసిసి అధికారిక ర్యాంకులను ప్రామాణికంగా తీసుకుంటారు.
ఆతిథ్య కోటా (1 బెర్త్): ఆతిథ్య హోదాలో అమెరికా నేరుగా అర్హత సాధించింది. కానీ, క్వాలిఫికేషన్ గడువు ముగిసేలోపు అమెరికా జట్టు ఐసిసి టాప్-15 ర్యాంకుల్లో కనీసం ఒక్కసారైనా చోటు దక్కించుకోవాలనే నిబంధన పెట్టారు.
గ్లోబల్ క్వాలిఫైయర్ (1 బెర్త్): మిగిలిన చివరి ఒక్క స్థానం కోసం ‘ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్’ నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన జట్టు ఒలింపిక్స్ టికెట్ సాధిస్తుంది.
మహిళల విభాగంలో...
మహిళల విభాగంలో మెగా ఈవెంట్‌కు అర్హత సాధించే విధానం పురుషుల కంటే భిన్నంగా ఉంది. వీరికి ఐసిసి ర్యాంకులను కాకుండా మెగా టోర్నీ ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుంటారు.
వరల్డ్ కప్ ప్రదర్శన (4 బెర్త్‌లు): ఈ ఏడాది (2026) జరిగే ఐసిసి మహళల టి0 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా నాలుగు జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో నాలుగు వేర్వేరు ఖండాల నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లకు ఈ ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి.
మిగిలిన స్థానాలు (2 బెర్త్‌లు): పురుషుల మాదిరిగానే అమెరికా మహిళల జట్టుకు ఆతిథ్య కోటా కింద ఒక చోటు దక్కగా.. చివరి 6వ స్థానాన్ని గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నీ ద్వారా భర్తీ చేస్తారు.
వెస్టిండీస్, బ్రిటన్ జట్లకు ప్రత్యేక నిబంధనలు
ఐసిసిలో గుర్తింపు ఉండి, ఐఓసిలో గుర్తింపు లేని జట్ల విషయంలో స్పష్టతనిచ్చారు. వెస్టిండీస్ జట్టు కరేబియన్ దీవుల కలయికగా ఆడుతుంది కాబట్టి, ఒలింపిక్స్‌లో దానికి ఒకే దేశంగా గుర్తింపు లేదు. ఒకవేళ ఆ జట్టు గ్లోబల్ క్వాలిఫయర్‌కు వస్తే.. దాని సభ్య దేశాల (జమైకా, బార్బడోస్ మొదలైనవి) మధ్య ప్రత్యేక టోర్నీ నిర్వహించి, గెలిచిన ఒకే ఒక్క దేశాన్ని క్వాలిఫయర్‌కు పంపుతారు. ఇక బ్రిటన్ విషయానికి వస్తే, గ్రేట్ బ్రిటన్ తరఫున ఇంగ్లండ్ జట్టే ఒలింపిక్ అర్హత ప్రక్రియలో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాలతో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరికపై అత్యంత కీలకమైన ముందడుగు పడినట్లైంది.








కామెంట్‌లు (0)