- రైతులకు మెరుగైన ఆదాయం కల్పించేలా పనిచేయాలి
- కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్
ప్రజాశక్తి - విజయనగరం కోట : విజయనగరం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితల సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఆయిల్ పామ్ పరిశ్రమ ప్రతినిధులు, రైతులు సమన్వయంతో పనిచేస్తూ సాగు అభివృద్ధికి పటిష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని ఆయన సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆయిల్ పామ్ స్టేక్‌హోల్డర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ జోనల్ విధానాన్ని తొలగించి ఓపెన్ మార్కెట్ విధానం అమలు చేస్తే మిల్లుల మధ్య పోటీ పెరిగి, రైతులకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినట్లు వారు వివరించారని తెలిపారు. జాయింట్ సెక్రటరీ అంగ్షుమాన్ దేవ్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు సాధించిన పురోగతి, సాగు విస్తరణకు ఉన్న అవకాశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గెలల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ తదితర అంశాలపై ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులతో సమగ్రంగా చర్చించారు. ఆయిల్ పామ్ తోటల్లో మిరియాలు, జాజికాయ, బొప్పాయి వంటి లాభదాయకమైన పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి చిట్టిబాబు, కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, రాధికా వెజిటబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎం.ఎఫ్.ఆయిల్స్ ప్రయివేటు లిమిటెడ్, గోపాలకృష్ణ, శ్రీనివాస పామ్ ఆయిల్ మిల్, పతంజలి ఫుడ్స్, శాంతి ఆయిల్ పామ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు, ఇతర ఆయిల్ పామ్ పరిశ్రమల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)