బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు మార్కెట్‌లో దోపిడీ యథాతథం..

15 నవంబర్, 2026

పొగాకు మార్కెట్‌లో దోపిడీ యథాతథం
- సగటు ధర ఆరంభం రోజున రూ.250.. ఇప్పుడు రూ.190
- వేలం చివరిలోనూ 26.74 శాతానికి పైగా బేళ్ల తిరస్కరణ
- కరువైన ప్రభుత్వ పర్యవేక్షణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 10:20 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- సగటు ధర ఆరంభం రోజున రూ.250.. ఇప్పుడు రూ.190

- వేలం చివరిలోనూ 26.74 శాతానికి పైగా బేళ్ల తిరస్కరణ

- కరువైన ప్రభుత్వ పర్యవేక్షణ

ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో: ధరల కోసం రైతులు రోడ్లెక్కడంతో మంత్రులూ, పొగాకు బోర్డు, వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారులు నాలుగు రోజులు హడావిడిగా సమావేశాలు నిర్వహించి ఏదో చేస్తున్నామనే భ్రమలు కల్పించారు. సిఎం చంద్రబాబు పలుసార్లు పొగాకుపై సమీక్షలు నిర్వహించి పొగాకు కొనాల్సిందేనంటూ హెచ్చరికలు చేసినా పొగాకు వ్యాపారుల తీరు మారలేదు. అదే దోపిడీ యథాతథంగా కొనసాగుతోంది. ఆరంభం నుంచీ ఇప్పటివరకూ పొగాకు రైతులు చేసిన ప్రతిపాదనలేవీ ప్రభుత్వాలు అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక్కో బ్యారన్‌‌కు సుమారు రూ.ఐదు లక్షలకుపైగా నష్టం తప్పదని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను గట్టెక్కించేందుకు ఏ చర్యలూ తీసుకోలేదు.

కొనసాగుతున్న దోపిడీ...

ఆరంభం నుంచీ ఇప్పటి వరకూ దోపిడీ కొనసాగుతోంది. వేలంలో పోటీ లేదు. వ్యాపారులకు తిరుగులేదు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేశంతోనే పోటీ పెరిగి ధరలు వస్తాయని రైతుసంఘాలు ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాయి. అనేకసార్లు బోర్డు సమావేశాల్లోనూ రైతు ప్రతినిధులు చెప్పారు. మంత్రులకూ ఇదే స్పష్టం చేశారు. వేలంలో ప్రభుత్వం వైపు నుంచి జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో వ్యాపారులకు కలిసొచ్చింది. గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా ఏం చేస్తారులే అనే భావన వారిలో పెరిగింది. ఫిబ్రవరిలో వేలం మొదలు కాగా మొదటి రోజున సగటు ధర కిలో రూ.250 ఉండగా అది శనివారం రూ.190 కు చేరింది. అంటే కిలోకు రూ.60లు నష్టం జరిగింది. అదే సమయంలో ఈ ఏడాది పొగాకు ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడంతో సిగరెట్ల ధరలు భారీగా పెరిగాయి. కానీ, రైతులు పండించిన పంటకు మాత్రం ధరలు తగ్గాయి.

వేలం చివరిలోనూ అదే తీరు

వేలం చివరి దశకు చేరినా తిరస్కరణలు తప్పడం లేదు. ఇప్పుడు పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో బోర్డు పర్యవేక్షణ కూడా లేదు. శనివారం నాటి వేలం తీరును పరిశీలిస్తే ఎబిఎస్‌ ‌పరిధిలోని వేలం కేంద్రాలకు 1,397 బేళ్లు రాగా 473 బేళ్లను ఏవో సాకులతో వెనక్కి పంపేశారు. ఎల్‌ఎస్‌‌ పరిధిలోని కేంద్రాలకు 2,599 బేళ్లు రాగా 695 బేళ్లను తిరస్కరించారు. 26.74 శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. చివరి దశలోనూ ఈ స్థాయిలో బేళ్లను తిరస్కరిస్తుంటే వేలం ఎప్పటికి పూర్తవుతుందన్నదే రైతుల్లో ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే జాప్యం వల్ల పొగాకు నాణ్యత కూడా తగ్గిపోయిందని, మరో వైపు ఈ ఏడాది నాట్లు వేసే సమయం కూడా వచ్చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరగని ధరలు.. పతనం దిశగా మార్కెట్‌

ఇప్పటివరకూ ఎస్‌‌బిఎస్‌‌లో 54.97 మిలియన్‌‌ కిలోల పొగాకు అమ్ముడుపోగా సగటు ధర కిలోకు రూ.190.13 దక్కింది. ఎస్‌ఎల్‌ఎస్‌‌లో 52.53 మిలియన్‌‌కిలోలు అమ్ముడుపోగా సగటు ధర రూ.193.64 ఉంది. శనివారం నాటి కొనుగోళ్లపై సగటు ధరలు ఎస్‌ఎల్‌ఎస్‌‌లో రూ.148.84 వచ్చింది. అంటే ధరల పతనం ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వేలం తీరుపై కేంద్రం స్పందనలేదు. వేలం అంటే పోటీ ఉండాలి. కానీ అది ఏరోజూ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు కేటాయించి సమాఖ్య లేదా ఎస్‌‌టిసిలను రంగంలోకి దించితే ధరలు పెరుగుతాయని, రైతులు తొలి నుంచీ చెబుతున్నా, అందుకు ప్రభుత్వాలు ససేమిరా అన్నాయి. రాష్ట్రం మాత్రం బోనస్‌‌గా కిలోకు రూ.10 ప్రకటించి, కంటి తుడుపు చర్యలతో చేతులు దులుపుకుంది. కానీ, వేలం మెరుగుపడటానికి పోటీ మాత్రం పెంచలేదు. ఇటీవల 40 కంపెనీలకు పైగా వేలంలో పాల్గొనగా ఇపుడు 14 నుంచి 18 కంపెనీల ప్రతినిధులు మాత్రమే వస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో వేలంలో సిండికేట్‌ ‌కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరే పొగాకు రైతుల నష్టాలకు కారణమని చెప్పకతప్పదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్