గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం తగదు

1 గంట క్రితం

vadde
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 02:03 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో పూర్తిచేయగల చిన్న సాగునీటి ప్రాజెక్టులను, పెండింగ్ మరమ్మతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని రైతు సంఘాల నాయకులు మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్ యారాసురి మహదేవ్, సామాజిక కార్యకర్త డాక్టర్ వసుంధర, ఎన్టీఆర్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. శోభనదీశ్వరరావు మాట్లాడుతూ... శ్రీశైలం డ్యామ్ ఏప్రాన్ సమీపంలో భారీ గుంట ఏర్పడినా పునాదుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఒకవేళ శ్రీశైలం డ్యామ్‌కు ఏదైనా ప్రమాదం సంభవిస్తే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలపై దాని తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

రైతులకు తక్కువ వ్యయంతో తక్షణ సాగునీరు అందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం భారీ వ్యయ ప్రాజెక్టులు, భూసేకరణలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టడం సరికాదని శోభనదీశ్వరరావు హితవు పలికారు. ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వం తమ ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవాలని, వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణాన్ని తక్షణమే ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అలాగే హంద్రీ-నీవా ప్రధాన కాలువ వెడల్పుపై నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని సరైన సామర్థ్యంతో కాలువ నిర్మాణం, లైనింగ్ చేపట్టాలని కోరారు. కేవలం రూ. 250 కోట్లతో వరికపూడి సెల ప్రాజెక్టు చేపడితే సుమారు 80 వేల ఎకరాలకు, వంశధార కాలువను ఇచ్చాపురం వరకు పొడిగిస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని వివరించారు. దీనితో పాటు కేవలం రూ. 30 నుండి 40 కోట్లతో పోలంపల్లి మునియేరు డ్యామ్‌ను మరమ్మతు చేయవచ్చని గుర్తు చేస్తూ, 2021 వరదల్లో దెబ్బతిన్న అన్నమయ్య డ్యామ్ పునరుద్ధరణ పనులను కూడా యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్ యారాసురి మహదేవ్ మాట్లాడుతూ... విభజన చట్టం 2014 షెడ్యూల్ XIII సెక్షన్ 93 ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన పెట్రో కెమికల్ ప్లాంట్‌ను మచిలీపట్నంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రూ. 5,000 కోట్ల వాయబిలిటీ గ్యాప్ ఫండ్ (విజిఎఫ్) భారం నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌ను రామాయపట్నం బిపిసిఎల్ రిఫైనరీలో కలిపేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రామాయపట్నం ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం దాదాపు రూ. 40,000 కోట్ల క్యాపిటల్ రాయితీలను 20 ఏళ్లలో చెల్లించాల్సి వస్తోందని, అంతగా ప్రజాధనం వెచ్చిస్తున్నప్పుడు పెట్రో కెమికల్ ప్రాజెక్ట్‌ను కూడా అక్కడే ఎందుకు కేంద్రీకరించాలని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల పీవీసీ, ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమలు వచ్చి కృష్ణా జిల్లా, దివిసీమ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

సామాజిక కార్యకర్త డాక్టర్ వసుంధర మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిపిపి విధానం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 1.23 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను పిపిపి కింద ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతూ, వాటికి ప్రభుత్వమే భూములు, లోన్లు, రాయితీలతో పాటు రూ. 1,500 కోట్ల వీజీఎఫ్ (విజిఎఫ్) కూడా అందిస్తోందని విమర్శించారు. నిత్యావసర సేవలు, విద్య, వైద్యం, సాగునీరు వంటి రంగాలను పిపిపి పరిధిలోకి తెచ్చి, ప్రజల నుండి యూజర్ చార్జీలు వసూలు చేసుకునేలా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. చివరకు 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను' కూడా పిపిపి మోడల్‌లోకి మార్చడం వల్ల, పౌరుల ఆస్తుల రిజిస్ట్రేషన్లు, విల్ నామాలు వంటి అత్యంత సున్నితమైన సమాచారం ప్రైవేట్ ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లి డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, దస్తావేజుకు రూ. 2,000 వరకు అదనపు భారం పడుతుందని ఆరోపించారు. పిపిపికు సంబంధించిన డిపిఆర్ లను, కన్సెషన్ అగ్రిమెంట్లను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఉపయోగపడే వైకుంఠపురం బ్యారేజీ పనులు గత 28 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, ఫలితంగా నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం ప్రాంతాలు కరువు బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలన్నారు. అలాగే బందర్ పోర్టు నుండి ముక్త్యాల వరకు జలరవాణా మార్గం కోసం రూ. 1,700 కోట్లతో టెండర్లకు సిద్ధమవడాన్ని తప్పుపట్టారు. వైకుంఠపురం నుండి పులిచింతల వరకు ఉన్న 64 కిలోమీటర్లలో కేవలం 7 కిలోమీటర్లలోనే నీరు ఉండి, మిగిలిన భాగం ఎడారిలా ఉంటే నౌకలు ఎలా నడుస్తాయని నిలదీశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్