- ఎపిఎం ఎపి బోర్డ్ సిఇఒ .చంద్రశేఖర్ వెల్లడి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఔషధ, సుగంధ మొక్కల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) ఆవుల చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో ఔషధ మొక్కల సాగు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీఎంఏపి బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్, ఉప కలెక్టర్ కె. సాహిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఔషధ మొక్కల సాగుకు అనువైన భూములను గుర్తించి, అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుంటూ రైతులు వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ, ఉప కలెక్టర్ కె. సాహిత్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఈవో ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఔషధ మొక్కల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రధానంగా మునగ, చింత, సింధూర, తెల్లమద్ది, కరివేపాకు, లెమన్ గ్రాస్, నేలవేప, నేల ఉసిరి, నల్ల మిరియాలు, అడవి పసుపు, అలోవెరా తదితర ఔషధ, సుగంధ మొక్కల సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కల సాగుతో పాటు వాటి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన అవకాశాలను కూడా సమన్వయం చేస్తున్నామన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంటల సాగు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, స్థిరమైన జీవనోపాధి కల్పించడం, సుస్థిర అభివృద్ధి సాధించడం ప్రధాన లక్ష్యాలని వివరించారు విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని సీఈవో తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల విద్యాలయాల ప్రాంగణాల్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచడం ద్వారా విద్యార్థులకు తాజా, రసాయన రహిత పోషకాహారం అందించవచ్చని పేర్కొన్నారు.
విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇళ్ల వద్ద చిన్నచిన్న పోషణ్ వాటికలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా పండించిన తాజా ఆహారం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.మహిళలు, చిన్నారుల్లో విటమిన్లు, ఖనిజ లవణాల లోపాలను తగ్గించేందుకు పోషణ్ వాటికలు దోహదపడతాయని వివరించారు. సేంద్రియ ఎరువులు, ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో తక్కువ ఖర్చుతో తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా బయటి మార్కెట్లపై ఆధారపడకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాలను స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దవచ్చన్నారు. తులసి, అలోవెరా వంటి ఔషధ మొక్కల పెంపకంతో పోషకాహారంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా తోడ్పాటు లభిస్తుందని తెలిపారు.పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో పోషకాహార, ఔషధ మొక్కల పెంపకానికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని సీఈవో హామీ ఇచ్చారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి సంపూర్ణ వికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. లండన్ మహానగరంలోని బ్రిటన్ పార్లమెంట్ హాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎంఏపి బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్‌ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐటీడీఏ మేనేజర్ కుమారస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, వ్యవసాయ శాఖ అధికారి నందు, ఏపీసీఎన్ఎఫ్ ప్రతినిధి భాస్కర్, అటవీ శాఖ రేంజ్ అధికారి దేవి రాజేశ్వరి, డీఆర్డీఏ అధికారి జయకృష్ణ, హుకుంపేట తహసీల్దార్ ముజీబ్, పాడేరు తహసీల్దార్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)