mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఎం మాట అమలు చేయరా?

1 గంట క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 12:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• చంద్రబాబు పొగాకును రూ.200కు కొనమంటే రూ.160కు కొంటున్న వ్యాపారులు

• వారిపై ఒత్తిడి చేసి కొనిపిస్తారా? లేక ప్రభుత్వమే కొంటుందా?

• వెయ్యి కోట్లు నిధులు కేటాయిస్తేనే సంక్షోభానికి పరిష్కారం: వి శ్రీనివాసరావు

• ఒంగోలులో వేలం కేంద్రం సందర్శన, రైతుల దీక్షలూ ప్రారంభం

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో: కిలో పొగాకును రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, ఇపుడు వేలంలో కిలో రూ.160కు దిగజారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం మాటలకు విలువ ఉందా? బహిరంగంగా ఆయన చెప్పిన మాటను అమలు చేయరా? అని ప్రశ్నించారు. వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి ఆయన చెప్పిన ధరకు తగ్గకుండా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి కొనుగోలు చేస్తే సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందన్నారు. బుధవారం ఆయన ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని పార్టీ జిల్లా నేతలు, రైతు సంఘం నేతలతో కలిసి సందర్శించారు. వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మంచి పొగాకు తెచ్చినా గ్రేడ్ తగ్గించి వేస్తున్నారని రైతులు వాపోయారు. అనంతరం ఒంగోలు కలెక్టరేట్‌‌ వద్ద సంయుక్త కిసాన్‌‌ మోర్చా నేతృత్వంలో చేపట్టిన పొగాకు రైతుల దీక్షలను శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతుల ఆందోళనకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వేలం తీరు ఎలా ఉందో ఇపుడే పరిశీలించానని, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలకు, వ్యాపారులు ఇస్తున్న ధరలకు ఏ మాత్రమూ పొంతనలేదని తెలిపారు. గతేడాది కంటే కిలోకు రూ.30 తగ్గించి కొంటున్నారన్నారు. ఇదే తీరున వేలం కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. రైతులు గిట్టుబాటు ధరలేనందునే రోడ్లపైకి వచ్చారన్నారు. బిజినెస్‌ ఎలైట్‌ ‌పేరుతో వ్యాపారులను కూర్చోబెట్టి పరిశ్రమలు పెడితే అన్ని రకాల రాయితీలు ఇస్తామని చెప్పిన మంత్రులు, అధికారులు... పొగాకు రైతులతో కనీసం ఏ రోజైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఎగుమతి ఆర్డర్లు లేవని ఎన్ని రోజులు సాకులు చెబుతారని వ్యాపారులను ప్రశ్నించారు. 'ఒకసారి పన్నులు పెంచారని చెబుతారు. ఇంకోసారి పశ్చిమాసియా యుద్ధమంటారు. మనకేనా ఈ సమస్యలు` అని ప్రశ్నించారు. ఒకవైపు ఐటిసి కంపెనీ కోట్ల రూపాయలు లాభాలు గడిస్తోందని, గడిచిన ఆరు నెలల్లో ఆ కంపెనీ షేర్‌ ‌విలువ ఆరు శాతంపైగా పెరిగిందన్నారు. కేంద్రం పెంచిన పన్నులను తగ్గించాలని బ్లాక్‌మెయిల్‌ ‌చేసే ధోరణిలో వ్యాపారులున్నారని పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలకు గుంటూరుకు పిలిచి ఆందోళన విరమించాలని రాయబారాలు జరపడం ఏమిటని, పొగాకు బోర్డు చైర్మన్, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల పక్షాన ఉంటారో? వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతే బోర్డు చైర్మన్‌, పాలకవర్గం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25లోపు సంక్షోభానికి పరిష్కారం చూపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బోర్డు పూర్తి స్థాయి సమావేశంలో పొగాకు కొనుగోళ్లపై చర్చించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. వేలం కేంద్రం సందర్శన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్‌‌కె మాబు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె.జయంతిబాబు, శ్రీకాంత్, దీక్షల వద్ద సంయుక్త కిసాన్‌‌మెర్చా జిల్లా కన్వీనర్‌ ‌చుండూరి రంగారావు, రైతు సంఘాల నేతలు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్