- ఆదివారం సాయంత్రం నుంచి అదృశ్యం..
- రాచపల్లి పొలాల్లోని చెరువులో లభ్యమైన మృతదేహం
- ఒమ్మంగి గ్రామంలో విషాదఛాయలు
ప్రజాశక్తి ప్రత్తిపాడు : ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఓ పాఠశాల విద్యార్థి చెరువులో శవమై తేలిన విషాద ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన మొండి వెంకటరమణ కుమారుడు వినయ్ శివశంకర్ స్థానిక గాయత్రి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వినయ్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి వెంకటరమణ ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం రాచపల్లి పొలాల్లోని గుల్లెంకల చెరువులో వినయ్ మృతదేహం లభ్యమైంది. స్నేహితులతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఒమ్మంగి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు రామిశెట్టి మునసీబు, నాని తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.








కామెంట్లు (0)