మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసాగుకు సమగ్ర కార్యాచరణ...!

22 నిమిషాల క్రితం

CM inquires about fire accidents in the state during the festival
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 10:18 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్

  • పెట్టుబడులకు హార్టికల్చర్ సమ్మిట్

  • వ్యవసాయ శాఖ సమీక్షలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికంగా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సచివాలయంలో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, ఎల్‌నినో విపత్తుల వంటి ప్రకృతి వైపరీత్యాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో పంట నష్టాన్ని నివారించేలా సాగు విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు, స్పష్టమైన ఫలితాలు, అధిక లాభాలు కనిపించాలని అన్నారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సహకారంతో సుమారు రూ.40 వేల కోట్ల నిధులను సమీకరించాలని, మిగిలిన రూ.60 వేల కోట్లను వివిధ పెట్టుబడుల ద్వారా సమకూర్చుకుని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు ప్రారంభించాలని, ప్రతినెలా పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో ప్రకృతి వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యాన పంటల్లో కొత్త రకాలను పరిచయం చేస్తూ ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు.ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ‘హార్టికల్చర్ సమ్మిట్’ను నిర్వహించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఆధునిక పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు కొత్త రకాల పంటలను రైతులకు పరిచయం చేయాలని, భూసార పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రైతులతో పాటు కౌలు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాలని సూచించారు.

సాగు క్యాలెండర్ ముందుకు...

​తుఫాన్ల కారణంగా పంటలకు నష్టం వాటిల్లకుండా అవసరమైతే పంటల సాగు క్యాలెండర్‌ను ముందుకు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్ నుంచి సాగును ముందుగానే ప్రారంభించి తుఫాన్ల ప్రభావం పంటలపై పడకుండా చూడాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంటలకు ఇటీవల సంభవించిన తుఫాన్లతో పెద్దగా నష్టం వాటిల్లలేదని, దీనిపై వరి రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పంట సీజన్ ప్రారంభానికి ముందే సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత, పంటల సాగు కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ​వ్యవసాయం, ఆక్వా, హార్టికల్చర్ రంగాలకు సంబంధించిన సేవలన్నింటినీ ఒకే యాప్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. అగ్రివాచ్‌పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించి, దాని సమర్థ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు.

​12.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం

ప్రస్తుత ఖరీఫ్‌లో ఎల్‌నినో కరువు పరిస్థితులు, అర్నబ్, మురసు తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా 26 జిల్లాల్లో మొత్తం 12.64 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. ఇందులో 9.67 లక్షల హెక్టార్లలో ఎల్‌నినో కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. అర్నబ్ తుఫాను కారణంగా 13 జిల్లాల్లో 3.82 లక్షల మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతినగా, మురసు తుఫాను ప్రభావంతో 9 జిల్లాల్లో 52,402 మంది రైతులకు చెందిన పంటలకు నష్టం వాటిల్లింది. తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలతో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న పంటలకు మొత్తం రూ.2,743 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అధికారులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 11.55 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పంటల బీమా పరిధిలో ఉందని అధికారులు తెలిపారు. నష్టపోయిన పంటలకు రూ.1,732 కోట్ల బీమా క్లెయిమ్‌లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. డిజి రైతు బజార్ ప్రారంభించాక ఇప్పటికి లక్షకు పైగా ఆర్డర్లకు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే మొబైల్ రైతు బజార్లు వచ్చే ఫిబ్రవరి కల్లా మరో 40 పెంచనున్నట్టు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్