పులివెందుల డిఎస్‌పి మురళీనాయక్‌పై కోర్టు సీరియస్
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : పులివెందుల కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి నేతలపై నమోదు చేసిన కేసు, అరెస్టు ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించడంపై పులివెందుల న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని డిఎస్‌పి మురళీ నాయక్‌ను, పోలీసులను కోర్టు హెచ్చరించింది.
గత నెల 17న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులపై దాడి చేశారంటూ వైసిపి నాయకులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా సోమవారం వైసిపి నేతలు రామనాథ్‌రెడ్డి, ఖాన్‌లను అరెస్టు చేసి, మంగళవారం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. కూటమి నాయకులకు మద్దతుగా నిలిచి, వైసిపి నేతల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, వారి వాహనాలను ధ్వంసం చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి కాల్పులు జరిపారని వైసిపి నేతల తరపు న్యాయవాది ఓబుల్‌రెడ్డి ఆధారాలతో సహా కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో, అరెస్టు చేసిన ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచే సమయంలో చట్టపరమైన నిబంధనలు పాటించలేదని, వారి హక్కులకు భంగం కలిగించారని న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ కారణాలతో వైసిపి నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ, పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదం జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని డిఎస్‌పి మురళి నాయక్‌ను, పోలీసులను కోర్టు హెచ్చరించింది.








కామెంట్‌లు (0)