ఎనిమిది మంది మృతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమిక అంచనా
ప్రభావిత ప్రాంతాల్లో నేడు సిఎం పర్యటన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మురసు తుపాన్ కారణంగా రాష్ట్రంలో 1,988 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది. గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు రూపొందించిన నష్టం వివరాలను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందచేశారు. ఈ నివేదిక ప్రకారం 1,43,122 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 1,86,063 మంది రైతులు నష్టపోయారు. వర్షాల కారణంగాగా 983 ఇళ్లు, 346 బోట్లు, 220 వలలు కూడా దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు మరో 48 నుండి 72 గంటల పంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ఎనిమిది మంది మరణించినట్లు చెప్పారు. బాపట్ల జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతులలో ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. అనంతరం సిఎం మాట్లాడుతూ వరుసగా రెండు తుపాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారుల మరమ్మతులు, తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. నేడు (శుక్రవారం) స్వయంగా తాను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. మురసు తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక త్వరితగతిన రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశించారు.






కామెంట్‌లు (0)