ఇద్దరు మృతి
న్యూఢిల్లీ : ఓల్డ్ ఢిల్లీలోని చావ్రి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సత్తారా, పీష్ మహల్లో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే నలుగురిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. డిసిపి (సెంట్రల్) రోహిత్ రాజ్బీర్ సింగ్ ప్రకారం, భవనం కూలిపోయినప్పుడు సుమారు 15 మంది నిర్మాణ కార్మికులు ఆ ప్రదేశంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆరుగురు నుంచి ఏడుగురు కార్మికుల ఆచూకీ లభించగా, వారిలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురు కార్మికులను శిథిలాల నుంచి బయటకు తీశారు; వారిలో ఇద్దరు మరణించినట్లు ప్రకటించగా, మూడవ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మృతులను మండవాలి ప్రాంతంలోని రైల్వే కాలనీకి చెందిన కిషోరి (40), సంజీత్ (45)గా గుర్తించారు గత ఒకటిన్నర నెలలుగా నిర్మాణం జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. 50 చదరపు గజాల స్థలంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. స్తంభాల నిర్మాణం భారాన్ని తట్టుకోలేకపోవడంతో భవనం కూలిపోయిందని సంబంధిత అధికారి తెలిపారు.
అరగంట వ్యవధిలోనే...
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం గురువారం ఉదయం మూడో అంతస్తు తొలుత కూలిపోగా, ఆ తర్వాత అరగంట వ్యవధిలో మిగిలిన అంతస్తులు కూడా కూలిపోయాయి. తొలుత మూడో అంతస్తు కూలిపోగానే మిగిలిన వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. అందువల్లే ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భవనం కూలినప్పుడు భూకంపం వచ్చినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు, ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారులు వచ్చేటప్పటికే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కాంక్రీటు స్లాబ్ వేస్తుండగా భవనం కూలిపోయిందని డిసిపి (సెంట్రల్ డిస్ట్రిక్ట్) రోహిత్ రాజ్బీర్ సింగ్ విలేకరులకు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే, స్థానికులు ఆ ప్రదేశానికి చేరుకుని, చేతులతో శిథిలాలను తొలగించడం ప్రారంభించినట్లు స్థానికుడు అబ్దుల్ తెలిపారు. కాంక్రీట్ స్లాబులు, బరువైన రాళ్లు పడటంతో క్షతగాత్రులను బయటకు లాగడం కష్టమైందని చెప్పారు. మూడు అడుగుల వెడల్పులో సందు ఉండటంతో అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, ఎక్స్కవేటర్లతో సహా భారీ యంత్రాలు అక్కడికి వెళ్లలేకపోయాయి.
ఇద్దరు ఇంజనీర్ల సస్పెన్షన్, కాంట్రాక్టర్‌పై ఎఫ్ఐఆర్కు సిఎం ఆదేశం
ఈ ఘటన నేపథ్యంలో సంబంధిత జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లను సస్పెండ్ చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశించారు. దీంతో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వారిద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, కాంట్రాక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిఎం ఆదేశించారు. గత ఐదేళ్లలో ఢిల్లీలో భవనాలు కూలి 169 మంది మృతి చెందగా, దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిదివేల మంది ప్రాణాలు కోల్పోయారు.






కామెంట్లు (0)