ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘సంజీవిని'కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి

54 నిమిషాల క్రితం

‘సంజీవిని'కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
-వైద్య సిబ్బందిపై అదనపు పనిభారం మోపవద్దు
- ప్రజా ఆరోగ్య వేదిక చర్చాగోష్టిలో వక్తలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైద్య సిబ్బందిపై అదనపు పనిభారం మోపవద్దు

- ప్రజా ఆరోగ్య వేదిక చర్చాగోష్టిలో వక్తలు

ప్రజాశక్తి-ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : జన స్వాస్థ్య అభియాన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ అమిత్సేన్ గుప్తా ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అమరావతి బాలోత్సవ భవన్‌లో డాక్టర్ మామిడి సీతారామారావు అధ్యక్షతన ‘సంజీవిని ప్రాజెక్టు ప్రజలకు వరమా? శాపమా?’ అనే అంశంపై ఆదివారం చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వి. రమణయ్య మాట్లాడుతూ... ముందస్తు వైద్య పరీక్షలు, వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడం, ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం వంటి సంజీవిని ప్రాజెక్టు లక్ష్యాలు స్వాగతించదగినవని, అయితే ఈ ప్రాజెక్టు కారణంగా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలహీనపడకూడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు ప్రత్యేక బడ్జెట్, సిబ్బందిని నియమించాలని, వైద్య సిబ్బందిపై అదనపు పనిభారం మోపకూడదని కోరారు. పిపిపి విధానం ద్వారా ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య సమాచార గోప్యత, భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టాటా మెడికల్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ సంస్థతో ఒప్పందాలు, టెండర్లు, బడ్జెట్ వివరాలను బహిర్గతం చేయాలని, క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి తగిన శిక్షణ కల్పించాలని కోరారు.

ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి. కామేశ్వరరావు మాట్లాడుతూ... ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వ సమతుల్య నియంత్రణ అవసరమన్నారు. అధిక వైద్య బిల్లులు, అనవసర పరీక్షలు, చికిత్సలను నియంత్రించేందుకు ప్రామాణిక ధరల విధానం అమలు చేయాలని, చికిత్సకు ముందే ఖర్చుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రమాదాలు, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో డిపాజిట్ల కోసం ఆలస్యం చేయకుండా తక్షణ చికిత్స అందించాలని, వైద్యుల వృత్తిపరమైన స్వతంత్రతతో పాటు రోగుల హక్కులు, సమాచారంతో కూడిన సమ్మతిని పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది, మందులను మెరుగుపరచి ఆరోగ్య చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్ జిల్లా ప్రజారోగ్య వేదిక కార్యదర్శి జి. విజయ్ ప్రకాష్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె. వి. ఎస్ సాయి ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి రాజేశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ వల్లూరు రామారావు, డాక్టర్ అంకయ్య, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నేత సాగర్, 104 ఎంప్లాయిస్ నేత రత్నరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్