- అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాగు, తాగునీళ్లకు కటకటలాడుతున్న రాయలసీమ జిల్లాలకు ఎంతో కొంత ఉపయోగపడే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, అదేవిధంగా పల్నాడు మంచినీటి ప్రాజెక్టును రాజకీయ స్వార్థంతో వివాదంగా మార్చొద్దని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపిలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. దీనిని తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల వివాదంగా మార్చొద్దని, కృష్ణా జలాలు ఇరువురికీ ఉపయోగపడాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను వివాదం చేయొద్దని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. తక్షణం తెలంగాణ, ఆంధ్రపదేశ్ ప్రభుత్వాలు చర్చించి ఈ సమస్యను ఒక కొలిక్కి తేవాలని, కేంద్రం కుట్రలో పావులు కావొద్దని సూచించారు. కృష్ణా జలాల మీద ఆధారపడి నిర్మించిన, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సమన్వయంతో, సంయమనంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొని నిత్యం కరువు కాటకాలకు నిలయంగా ఉన్న రాయలసీమ ప్రాంతానికి న్యాయంగా రావలసిన నీళ్లు ఇచ్చి, ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆ ప్రాంతాన్ని కరువు నుండి కాపాడాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం రాయలసీమ ఎంతగా వెనుకబడిందో తెలంగాణ వాసులకు కూడా తెలుసన్నారు. అందువల్ల సౌహార్థపూరితంగా వ్యవహరించాలని ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ తమ రాజకీయ స్వార్థానికి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను వివాదంగా మార్చి రాయలసీమకు సాగునీటి విషయంలో రైతులకు అన్యాయం చేయొద్దని, బాధ్యతగా వ్యవహరించి వెనకబడ్డ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వచ్చే మార్గాన్ని వెతకాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా, చర్చల ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకే కాకుండా మొత్తం కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య భావోద్వేగాలు పెంచడం కాకుండా ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారికి మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు.







కామెంట్లు (0)