సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీలకు కరువు ప్యాకేజీ ప్రకటించాలి

8 గంటల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 12:30 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

- వ్యవసాయ రుణమాఫీ చేయాలి

- ఉపాధిహామీలు 200 రోజులు, కనీస వేతనం అమలు చేయాలి

- డ్వాక్రా వడ్డీలు రద్దు చేయాలి

- అక్టోబర్ మొదటి వారం నుండే కొత్త పెన్షన్లు ఇవ్వాలి

- అనవసర నిబంధనలు తొలగించాలి

- 8 రకాల నిత్యావసర సరుకులు చౌక ధరలకు అందించాలి

- కేంద్రాన్ని లక్షకోట్లు అడగాలి

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్

ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షకోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 655 మండలాల్లో వర్షాభావం నెలకొందన్నారు. 80శాతం ఖరీఫ్ పంటలు వేయలేదని, వేసిన చోట కూడా పంటలు దెబ్బ తిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 లక్షల 40 వేల కోట్లు పంట నష్టం జరిగిందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే రూ.1000కోట్ల నష్టం జరిగిందన్నారు. ముందుగానే నీరు ఇస్తామని పంటలు వేసుకోవాలని ప్రభుత్వం కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంత రైతులకు చెప్పిందని, ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో ఇక్కడ కూడా పంటలు పండుతాయో? లేదో తెలియక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. తాగునీరు కూడా లేదన్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే కరెంట్ కోతలు విధిస్తున్నారని, గ్రామాల్లో ఇంకా ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ కోతలు వల్ల వ్యవసాయ బోర్లు ద్వారా పంటలకు నీటిని అందించేందుకు కూడా రైతులకు అవకాశం ఉండటం లేదన్నారు. ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినా పభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేకమంది కౌలు రైతులు ముందుగానే కౌలు చెల్లించారని, కానీ పంట వేయకపోవడంతో అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం కింద 125 రోజులు కల్పిస్తామన్నారని, కానీ ఈ గడువు ముగియడంతో తరువాత పరిస్థితి ఏమిటనే ఆందోళన వారిలో నెలకొందన్నారు. కరువు పనులు 200 రోజులు కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకంగా కరువు సహాయ నిధిని కేంద్రప్రభుత్వం పక్రటించాలని డిమాండ్ చేశారు. కరువు మండలాలు ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.50వేల చొప్పున కరువు సహాయ నిధిని అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రబీలో పంటలు పండుతాయో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరువు నెలకొనడంతో డ్వాక్రా మహిళలకు ఉపాధి లేదని, ఇఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితి మహిళలకు నెలకొందన్నారు. కాబట్టి ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరువును సమర్ధంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుండి లక్ష కోట్లు డిమాండ్ చేసి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా పాల ధర తగ్గించాలి.

కరువులో బరువు అనట్లుగా ఎన్‌నినో పేరుతో లాభాల కోసం ప్రైవేట్ వ్యాపారస్తులు ధరలు విపరీతంగా పెంచారని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు మార్కెట్‌లో భగ్గుమంటున్నాయని తెలిపారు. ధరలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం, పంచదార, నూనె, చింతపండు, మిర్చి, ఉల్లిపాయలు, కందిపప్పు, గోధుమపిండి వంటి 8రకాల వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యాపారస్తులతో పాటు మరోపక్క ప్రభుత్వం పాల ధరలు పెంచడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత నిత్యావసర సరుకైనా పాల ధరను విజయడైరీ పెంచడం సరికాదన్నారు. గత నెల పెంచిన ధరను ప్రజల ఆందోళనలతో ఉపసంహరించుకుందని వివరించారు. మరలా ఇప్పుడు వినాయకచవితి పండుగ కానుకగా ప్రజలకు పాల ధర లీటర్‌కు రూ.2లు పెంచిందన్నారు. ధరలు పెరిగి అల్లాడుతున్న ప్రజలకు సాయం చేయాల్సిన ప్రభుత్వం భారాలు ఎలా వేస్తుందని ప్రశ్నించారు. ఈ నిర్ణయం ప్రైవేట్ పాల ఉత్పత్తిదారుల మార్గం సుగమం చేసేందుకే అని విమర్శించారు. విజయ డైరీని నాశనం చేసేందుకు చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేసి స్వాధీనం చేసుకున్నారని, ఇప్పుడు ధర పెంచి మరోసారి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర పెంపు వల్ల వినియోగదారులకు, కనీసం డైరీకి కూడా ఉపయోగపడదని, కాబట్టి పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి

కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించుకునేందుకు,స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓట్లు రాబట్టుకునేందుకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించించదని తెలిపారు. ఇంటింటికి కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు వేల సంఖ్యలో పింఛన్ దరఖాస్తులు వచ్చాయని, ఇవి చెల్లవని మరలా దరఖాస్తు పెట్టుకోవాలని తెలిపిందన్నారు. నక్క-కొంగ విందు కథలా కొత్త పింఛన్లపై ప్రభుత్వ తీరు ఉందన్నారు. ఒక్కొ దరఖాస్తుకు 28 సాక్ష్యాలు తెచ్చుకోమంటున్నారని దాన్ని సులభతరం చేయాలని కోరారు. ఆదాయ పరిమితిని సంవత్సరానికి 3 లక్షలకు పెంచాలన్నారు. కొత్త దరఖాస్తుదారులకు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ మొదటి వారంలో పింఛన్లు ఇస్తేనే ప్రభుత్వ నిజాయితీ వ్యక్తమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత నూటికి 20 మందికే ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటుందన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, స్కీం వర్కర్లకు కూడా సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.

పథకాలు ఎత్తివేసేందుకు దుష్ప్రచారం

పింఛన్లు తీసుకొని మద్యం తాగేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రజలపై నిందారోపణ చేశారని తెలిపారు. ఒక పథకాన్ని ఎత్తేసేందుకు ముందుగా ప్రతిసారీ ప్రభుత్వమే దుష్ప్రచారం ప్రారంభిస్తోందన్నారు. గతంలో చంద్రబాబు పరిపాలనలో ఈ అనుభవం ఉందన్నారు. ప్రభుత్వమే ప్రజలకు మద్యం తాగిస్తోందన్నారు. తాగుడు వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, పింఛన్ వృధ్ధా అవుతుందని ప్రభుత్వం భావిస్తే మద్య నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, ఇందులో ఎమ్మెల్యేలకు, అధికారులకు వాటాలు వెళ్తున్నాయని విమర్శించారు. ప్రజలపై ఆరోపణలు చేసి పథకాలు ఎత్తివేస్తే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఉమ్మడి కుటుంబం ప్రస్తావని తీసుకొచ్చారని తెలిపారు. పింఛన్లు, సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులకు కోత పెట్టేందుకే పెద్ద కుటుంబాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకపోవడంతో ఒకే ఇంటిలో మూడు తరాలు వారు ఉంటున్న పరిస్థితి నెలకొందన్నారు. నిర్వాసితుల సమస్యలకు, కనీస వేతనాలు నిర్ణయించేందుకు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. కుటుంబం అంటే ఏమిటో సామాజిక శాస్త్రవేత్తలతో నిపుణుల బృందాన్ని నియమించి శాస్త్రీయంగా నిర్వచించాలన్నారు.

‘ఓటు హక్కు’ బాధ్యత ఎన్నికల కమిషన్‌దే - ఈనెల 15 ఎన్నికల అధికారిని కలుస్తాం : వై.వెంకటేశ్వరరావు

సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు ఏవరూ కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. అక్షరాలు తప్పులు, ఎన్నికల కమిషన్ చేసిన తప్పులతో ఓటర్లను బాధ్యులు చేయడం సరికాదన్నారు. ఓటర్లే నిరూపించుకోవాలని ఎన్నికల కమిషన్ వ్యవహరించడం సరికాదన్నారు. సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓటు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం అందించనునట్లు వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన లోపాలు, తీసుకోవాల్సిన చర్యలను ఆయనకు అందించబోతున్నామని చెప్పారు. ఎన్నికల యంత్రాంగంలో బాధ్యులుగా ఉన్న ఉద్యోగులు ఓటర్ల ఇంటికి స్వయానా వెళ్లి తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోవాలని కోరబోతున్నామని తెలిపారు. పారా మెడికల్ విద్యార్ధులకు స్టయిఫండ్ పెంచాలనిడిమాండ్ చేశారు. 10 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా విద్యార్ధులు ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదన్నారు. తిరుపతిలో విద్యార్ధులపై దౌర్జన్యం చేసి అరెస్టు చేశారని తెలిపారు. విద్యార్ధినుల పట్ల వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.తక్షణమే పారా మెడికల్ విద్యార్ధులను చర్చలకు పిలిచి స్టయిఫండ్ పెంచాలని, ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా విద్యార్ధుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధుల ఆందోళనలకు పూర్తి మద్దతు, సంఘీభావం తమ పార్టీ నుంచి ఉంటుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్