ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేష్‌ కుమార్‌పై అవినీతి ఆరోపణలు.. విచారణకు ఆదేశించిన కేరళం ప్రభుత్వం

51 నిమిషాల క్రితం

CEC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 01:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తిరువనంతపురం : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌పై రెండు దశాబ్దాల నాటి అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టాలని కేరళంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ బ్యూరో (విఎసిబి)ను ఆదేశించింది. కాంగ్రెస్‌ నేత మలయంకీళు వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర హోం మంత్రి రమేష్‌ చెన్నితాల ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అప్పట్లో కేరళ కేడర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారిగా ఉన్న జ్ఞానేష్‌ కుమార్‌ రాష్ట్ర ప్రజాపనుల శాఖ (పిడబ్ల్యుడి) కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్టు (కెఎస్‌టిపి) కింద ప్రధాన రహదారి అభివృద్ధి పనుల కాంట్రాక్టు పొందిన ఇండో-మలేషియా సంస్థ ప్యాటీ-బెల్‌ కన్సార్టియం నుంచి లంచాలు వసూలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతోపాటు అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


2006 నవంబరులో కౌలాలంపూర్‌లో ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ లీ సీ బీన్‌ ఆత్మహత్యకు సంబంధించిన ఆరోపణలపైనా విచారణ జరపాలని హోంమంత్రి విఎసిబి డైరెక్టర్‌ మనోజ్‌ అబ్రహాంను ఆదేశించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలోనే జ్ఞానేష్‌ కుమార్‌ను పిడబ్ల్యుడి కార్యదర్శి పదవి నుంచి తొలగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ ఆదేశాల మేరకు గతంలో నిర్వహించిన విజిలెన్స్‌ విచారణలోని అంశాలను కూడా పునఃపరిశీలించాలని చెన్నితాల సూచించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2006లో జరిగిన దర్యాప్తులో సరైన విధానాలను అనుసరించలేదని, లీ సీ బీన్‌ రాసినట్లు భావిస్తున్న నోట్‌లోని నేరపూరిత ఆరోపణలను విస్మరించారని వేణుగోపాల్‌ తన ఫిర్యాదులో ఆరోపించారు. అప్పటి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఈ విచారణను ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిందని, తద్వారా జ్ఞానేష్‌ కుమార్‌ కేంద్ర డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు.


ఈ వ్యవహారంలో రహదారి విస్తరణ పనులపై కాగ్‌ నివేదికను కూడా ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. క్షేత్రస్థాయి పనుల పురోగతిని సరిగా తనిఖీ చేయకుండానే కాంట్రాక్టు సంస్థకు గణనీయమైన మొత్తంలో వడ్డీలేని ముందస్తు చెల్లింపులు చేయడంపై పిడబ్ల్యుడిని కాగ్‌ తప్పుబట్టినట్లు అధికారులు తెలిపారు. పరిపాలనా వైఫల్యాలు, పాక్షిక బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, రహదారి పునఃరూపకల్పన ప్రతిపాదనలను నిలిపివేయడం, కాంట్రాక్టు సంస్థకు అనుకూలంగా నిబంధనల మార్పు వంటి అంశాలను కూడా నివేదికలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.92 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్‌ అంచనా వేసిందని తెలిపారు.


సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా విచారణకు ఆదేశించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్