ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపి అంతా పార్లమెంట్‌‌లో ఉండాలి

2 గంటల క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 09:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ముఖమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎన్‌‌డిఎ కూటమి ఎంపిలంతా పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఒక్క సభ్యుడు కూడా పార్లమెంటుకు హాజరుకాలేదనే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎంపిలతో ముఖ్యమంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కీలక బిల్లులపై ఎంపిలకు పలు సూచనలు చేశారు. కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా ఆదివారం సాయంత్రానికే ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు రావడం చారిత్రాత్మక సందర్భమన్నారు. మహిళా శక్తిని చాటేలా నూతన బిల్లు ఆమోదం పొంది కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో ప్రతి ఎంపి తన పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరిస్తూ.. ఆదివారమే ఢిల్లీ చేరుకోవాలని స్పష్టం చేశారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూశారని గుర్తుచేశారు. తాజా పునర్విభజనలోనూ అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 50 శాతం పెరుగుతుందని తెలిపారు. డీలిమిటేషన్ వల్ల ఎవరికీ నష్టం జరగదని పేర్కొన్నారు. గతంలో ఈ బిల్లులను వ్యతిరేకించిన కొన్ని పార్టీలు సైతం ప్రస్తుతం మద్దతు పలుకుతున్నాయని అన్నారు. ఎన్డిఎ నుంచి వచ్చే సూచనలను సభ్యులంతా తప్పకుండా పాటించాలని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చే సమయంలో రాష్ట్రానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటులో హాజరయ్యేలా చూడాలని సూచించారు. ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు లభించేలా వ్యవహరించాలని కోరారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వంటి చారిత్రక నిర్ణయాల సమయంలో పార్లమెంటు సభ్యులుగా ఉండటం గొప్ప సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్