చీరాలలో కిడ్నాప్ గురైన 6 నెలల పసికందు
జిల్లా ఎస్పీ నేతృత్వంలో 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
సాంకేతికత పరిజ్ఞానంతో తో నిందితుల కదలికలు గుర్తింపు
7 ప్రత్యేక బృందాల సాహసోపేత దర్యాప్తు ఫలితం
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు
ప్రజాశక్తి - చీరాల : చీరాలలో సంచలనం సృష్టించిన ఆరు నెలల పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిద్రపోతున్న తల్లిదండ్రుల చెంత నుంచి మాయమైన పసిబిడ్డను జిల్లా పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే చిన్నారిని అపహరించిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, బాలుడిని క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అంకితభావంతో పనిచేసిన ఏడు ప్రత్యేక బృందాలు, ఐటీ కోర్ టీమ్, సీసీ కెమెరాల విశ్లేషణతో ఈ కేసును వేగంగా ఛేదించారు.
ఈ విజయవంతమైన ఆపరేషన్ వివరాలను శుక్రవారం చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ శశి కుమార్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మీడియాకు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. మచిలీపట్నం మండలం ఇనకుదురు గ్రామానికి చెందిన కత్తి సుబ్బారావు, ఈశ్వరమ్మ దంపతులు జీవనోపాధి కోసం చీరాలకు వచ్చి ప్లాస్టిక్, చిత్తూ కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తూ కుందేరు సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే కొత్తపేట మూడు రోడ్ల కూడలిలో ప్లాట్‌ఫారంపై తమ ఆరు నెలల కుమారుడు అంజిబాబుతో కలిసి నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున లేచి చూసే సరికి చిన్నారి బాబు కనిపించకపోవడంతో సమీపంలో అంతా వెతికారు. టూ టౌన్ పోలీసులకు తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1వ తారీఖున జరిగిన ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఎస్పీ వెంటనే చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిస్ పర్యవేక్షణలో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు శాఖ రూపొందించిన 360 డిగ్రీ సీసీటీవీ ప్రాజెక్ట్ ద్వారా వందలాది కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులు ప్రయాణించిన ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో దాసరి సంజీవరావు, దాసరి శ్రీను అలియాస్ తుఫాను ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వేటపాలెం మండలం వడ్డె సంఘం గ్రామనికి చెందిన కట్టా ఆదినారాయణ, తిరుమల దంపతులకు 25 సంవత్సరాలు క్రితం వివాహం జరిగింది. అయినప్పటికీ సంతానం లేరు. అయితే ఆ దంపతులు ప్రసాద్ ధియేటర్ సమీపంలో చికెన్ షాపు నిర్వహిస్తుండగా అందులో పని చేసే సంజీవరావు, శ్రీను లతో తమకు ఓ బాలుడు కావాలని, చెత్త కాగితాలు, యాచాకుల పిల్లలు అయితే భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు ఉండదని కిడ్నాప్ కు పధకం రచించారు. బాలుడిని అప్పగిస్తే రూ. 1లక్ష నగదు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. రూ. లక్షకు బేరం కుదుర్చుకుని, ప్లాట్‌ఫారంపై నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జమ్ములపాలెంలో ఉన్న వారికి అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో దాసరి సంజీవరావు, దాసరి శ్రీను, కట్టా ఆదినారాయణ, కట్టా తిరుమల ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించగా, తమ బిడ్డను క్షేమంగా అప్పగించినందుకు చిన్నారి తల్లిదండ్రులు జిల్లా పోలీసులకు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు 27 రోజులైనా మిస్టరీ వీడలేదు. చీరాల పసికందు మిస్సింగ్ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించడంతో ప్రజలు ,తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా పసికందు కిడ్నాప్ కేసును చేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చీరాల డిఎస్పి ఎండి మోయిన్, చీరాల 2 టౌన్ సీఐ ఏ. శశికుమార్, చీరాల 1 టౌన్ సీఐ జి. సోమశేఖర్, చీరాల రూరల్ సర్కిల్ సీఐ యు. సుధాకర్, సోషల్ మీడియా సెల్ ఇన్‌స్పెక్టర్ వి. సూర్యనారాయణ, కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా, చిన్నగంజాం ఎస్‌ఐ రమేష్, ఇంకొల్లు ఎస్‌ఐ సురేష్, వేటపాలెం ఎస్‌ఐ జనార్ధన్, చీరాల శక్తి టీమ్ ఎస్‌ఐ హరిబాబు, ఐటి కోర్ ఎస్ఐలు ఏ.నాగేశ్వరరావు, సిహెచ్.అనూష చీరాల సబ్ డివిజన్, జిల్లా ఐటి కోర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.







కామెంట్‌లు (0)