శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సూళ్లూరుపేటలో పలు హోటళ్లపై తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు

2 గంటల క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 04:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : సూళ్లూరుపేట పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పలు హోటళ్లపై మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత కొంతకాలంగా హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాన్ని వాడుతున్నారంటూ ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులపై కమిషనర్ తక్షణమే స్పందించారు. ఈ మేరకు మున్సిపల్ విభాగానికి చెందిన సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న హోటళ్లపై మెరుపు దాడులు చేపట్టారు.

'ఆల్ సిరీస్' హోటల్‌లో కుళ్లిన చికెన్

​తనిఖీల్లో భాగంగా స్థానిక 'ఆల్ సిరీస్' హోటల్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వంటశాల (కిచెన్) అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. అంతేకాకుండా, ఫ్రిజ్‌లలో రోజూ వాడగా మిగిలిపోయిన, తీవ్ర దుర్వాసన వస్తున్న నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు. తాజా చికెన్ కాకుండా, ఇలాంటి నిల్వ చికెన్‌ను తరచూ వినియోగిస్తూ కస్టమర్ల ఆరోగ్యంతో ఆడుకుంటున్నట్లు రుజువు కావడంతో కమిషనర్ చిన్నయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సదరు 'ఆల్ సిరీస్' హోటల్‌కు రూ. 5,000 జరిమానా విధించారు. నిల్వ ఉంచిన మాంసాన్ని అక్కడికక్కడే సిబ్బందితో పారవేయించారు. ​ ​ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే మున్సిపాలిటీ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. హోటళ్ల యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా కాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. ​"కేవలం జరిమానాలతో సరిపెట్టేది లేదు. పట్టణంలో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ఏ హోటల్‌లో నైనా ఆహార నాణ్యత లోపించినా, వంటశాలలు అపరిశుభ్రంగా ఉంచినా, నిబంధనలు ఉల్లంఘించినా తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. లోపాలు పునరావృతమైతే సదరు హోటళ్లను శాశ్వతంగా సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోం’’ అని తెలిపారు. ఈ దాడుల్లో కమిషనర్‌తో పాటు మున్సిపల్ సానిటరీ విభాగం అధికారులు, ఆరోగ్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్