ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌

35 నిమిషాల క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 30, 2026, 12:15 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

-బరితెగించిన టిడిపి

-బాపట్ల జిల్లాలో గాలిలోకి కాల్పులు

-రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఉద్రిక్తత

​ప్రజాశక్తి- యంత్రాంగం : రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ‌కూడా ఉద్రిక్తతల నడుమే సాగింది. దాడులు, దౌర్జన్యాలు, బూత్‌‌ల ఆక్రమణ, రిగ్గింగ్‌, బ్యాలెట్‌ ‌బాక్స్‌‌లో ఇంకుపోయడం, ఓటర్లను అడ్డుకోవడం ‌వంటివి చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి బాపట్ల జిల్లాలో గాలిలోకి డిఎస్‌‌పి కాల్పులు జరిపారు. వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీలో పది వార్డులకుగానూ ఏడు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు వార్డులకు, సర్పంచ్ పదవికి ఆదివారం పోలింగ్ ప్రారంభమైంది. సర్పంచ్ పదవికి టిడిపి మద్దతుదారు, కాంగ్రెస్ మద్దతుదారు, ఒక ఇండిపెండెంట్ పోటీలో ఉన్నారు. పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామాలు ఉండగా కొత్తరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించి 5వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని బచ్చలవారిపాలెం అంగన్‌‌వాడీ కేంద్రంలో 202 ఓట్లు ఉండగా ఉదయం 8.30 గంటకు 105 ఓట్లు పోలయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడకు వచ్చిన ఓటర్లకు వారి ఓట్లు ముందే వేశారని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రీపోలింగ్ నిర్వహించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడుతున్న సమయంలో బచ్చలవారిపాలెం గ్రామ టిడిపి నేత అనుచరులు ఆయన వాహనంపై రాళ్ల దాడి చేశారు. దీంతో, రామచంద్రాపురం గ్రామానికి చెందిన వ్యక్తి గాయపడటంతో ఆ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బచ్చులవారిపాలెం చేరుకున్నారు. టిడిపి, కాంగ్రెస్ గ్రూపుల పరస్పర దాడులలో వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇరు గ్రూపులకు చెందిన సుమారు పది మంది గాయపడ్డారు. పోలీసులు లాఠీఛార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బాపట్ల డిఎస్‌‌పి చంద్రమౌళి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. చీరాల ఎమ్మెల్యే ఎం.మాలకొండయ్య గ్రామానికి వస్తుండగా పోలీసులు జాతీయ రహదారిపై అడ్డుకొని వెనక్కి పంపేశారు. ఇంతటి ఉద్రిక్తతలోనూ ఆ పంచాయతీలో 90.67 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు.

అనంతపురం జిల్లా యల్లనూరు మండల కేంద్రంలోని మేజర్‌ ‌పంచాయతీ పోలింగ్‌ బూత్‌‌లోకి వైసిపి మద్దతు ఏజెంట్లు వెళ్తుండగా టిడిపి మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో, ఘర్షణ చోటు చేసుకొని ఇరుగ్రూపుల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో టిడిపి మద్దతుదారులైన ఆంజనేయులు, ధర్మ, హరి, పవన్‌ ‌కుమార్‌‌తోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వైఎస్‌ఆర్‌ ‌కడప, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌!

వైఎస్‌ఆర్‌ ‌కడప, తిరుపతి జిల్లాల్లోని పలు పోలింగ్‌ ‌బూత్‌‌ల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌ జరిగింది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల మండలం వేంపల్లి మేజర్ పంచాయతీలో పోలింగ్ బూత్‌‌లను టిడిపి మద్దతుదారులు ఆక్రమించారు. దీనికి నిరసిస్తూ వైసిపి మద్దతుదారుల ఏజెంట్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చింతలమడుగుపల్లిలోని ఐదు పోలింగ్ కేంద్రాలను టిడిపి మద్దతుదారులు ఆక్రమించుకుని రిగ్గింగ్ చేశారు. వైఎస్ మదీనాపురం, ఫక్కీరుపల్లి ప్రాంతాలకు చెందిన మైనార్టీ ఓటర్లను అడ్డుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలనకు బయల్దేరిన కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని, వైసిపి రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డిని వేంపల్లిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. చక్రాయపేట మండలం గెడ్డంవారిపల్లిలో టిడిపి మద్దతుదారులు వైసిపి ఏజెంట్లను బయటకు గెంటేసి రిగ్గింగ్‌‌కు పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ పోలింగ్‌ కేంద్రం వద్ద బైఠాయించారు. కమలాపురం డివిజన్ పరిధిలో పాయసంపల్లిలో బయట ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లో తిష్ట వేసుకుని మహిళల ఓట్లు తాము వేసేశామని, వెళ్లిపోవాలని బెదిరించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామలో టిడిపి, వైసిపి గ్రూపుల రాళ్ల దాడితో ఉద్రిక్తత నెలకొంది. కోవెలకుంట్లలో మంత్రి పిఎ మురళి... గులదుర్తికి చెందిన అనుచరులతో పోలింగు కేంద్రంలో చొరబడి రిగ్గింగుకు పాల్పడ్డారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని వెనక్కు పంపించారు.

తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండల పరిధిలోని రణధీరపురం కేంద్రం వద్దకు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ మన్నెం శ్రీనివాస ప్రసాద్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, టిడిపి కార్పొరేటర్లు, ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున యువకులను పోగుచేసుకొని తీసుకొచ్చారు. వీరంతా పోలింగ్ కేంద్రంలోకి ఒక్కసారిగా చొచ్చుకెళ్లారు. అడ్డుకోబోయిన వైసిపి మద్దతుదారులపై బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. వీరంతా ఈ బూత్‌‌ను ఆక్రమించుకొని భారీ ఎత్తున రిగ్గింగ్ చేశారంటూ, ఇక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వైసిపి చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌‌ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైసిపి మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మీనారాయణ, వైసిపి మద్దతుదారులు ధర్నా చేశారు. కూటమి నాయకుల అక్రమాలకు, దౌర్జన్యాలకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితుల నడుమ మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేష్‌‌కు తరలించారు. గాంధీపురం పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రం వద్దకు వందల సంఖ్యలో బయట వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులను వైసిపి నాయకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇది వైరల్‌ అయ్యింది.

గోకవరంలో బిజెపి నాయకుడు కంబాల శ్రీనివాసరావునును అడ్డుకున్న టిడిపి శ్రేణులు

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని 5, 6 వార్డులకు జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. జనసేన మద్దతు అభ్యర్థులకు మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాసరావు ఇక్కడికి తన అనుచరులతో కలిసి వచ్చారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా టిడిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ అనుచరులకు, టిడిపి శ్రేణుల మధ్య తోపులాట చోటు జరిగింది. పోలీసులు వారందరినీ చెదరగొట్టారు.

వేట కొడవళ్లతో సర్పంచ్‌ ‌భర్తపై దాడి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకొర్రులో వైసిపి మద్దతుదారుడు సర్పంచ్‌‌గా బోయిన భాగ్యలక్ష్మి గెలుపొందారు. దీన్ని సహించలేని టిడిపి మద్దతుదారులు భాగలక్ష్మి భర్తపై వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకలాపాడులో టిడిపి మద్దతుదారులు, వైసిపి మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో వాదులాడుకుంటున్న వారిని నియంత్రించే క్రమంలో గత ఎన్నికల్లో జెడ్‌‌పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన రమాదేవి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళుతుండగా, పొన్నూరు రూరల్‌ ఎస్ఐ శ్రీహరి అడ్డుకోవడంతో ఆమె కింద పడిపోయారు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ చెప్పడంతో ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు.

చిన్నబగ్గ గ్రామంలో ఉద్రిక్తత

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం చిన్నబగ్గ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తరువాత మండల కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు, సిబ్బందితో వెళ్తున్న బస్సును చినబుగ్గ పంచాయతీ ప్రజలు అడ్డుకున్నారు. పోలింగ్ లోనూ, కౌంటింగ్ లోనూ అక్రమాలు జరిగాయని, మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఉల్లగల్లు, పసుపుగల్లులో కౌంటింగ్ నిలిపివేత కలెక్టర్ ఆదేశం

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో ఉదయం 7.30 గంటల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి బ్యాలెట్ పేపర్ కట్టలను టిడిపి నేతలు ఎత్తుకెళ్లారు. పోలింగ్ సిబ్బంది వారిని వెంబడించి.. వారి వద్ద నుంచి ఒక కట్టను స్వాధీనం చేసుకున్నారు. మిగతా రెండు కట్టల స్థానంలో కొత్త బ్యాలెట్ పేపర్లు తెప్పించారు. ఉల్లగల్లులో టిడిపి మద్దతుదారు, టిడిపి రెబల్ పోటీ చేస్తున్నారు. టిడిపి మద్దతుదారులు బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లడంతో రెబల్ అభ్యర్థి మద్దతుదారులు నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులను వారందనీ చెదరగొట్టారు. కాసేపటి తర్వాత టిడిపి నేతలు మళ్లీ పోలింగ్ కేంద్రానికి వచ్చి.. దొంగ ఓట్లు వేసేందుకు యత్నించగా రెబల్ అభ్యర్థి మద్దతుదారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఘర్షణ జరగడంతో పోలీసులు మళ్లీ చెదరగొట్టారు. తర్వాత ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. ఈ వివాదాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో కౌంటింగ్‌‌ను ఉల్లగల్లులో నిలిపేశారు. చింతలపూడి గ్రామంలో పదో వార్డులో టిడిపి అభ్యర్థి వాళ్లు ఎస్‌‌సి కాలనీవాళ్లకు డబ్బులిచ్చి మీరు పోలింగ్‌‌కు రావద్దని చెప్పారు. దీంతో, వాళ్లు పోలింగ్‌‌కు రాలేదు. వైసిపి అభ్యర్థి మద్దతుదారులు ఆ ఓట్లు మాకు పడేవని, వాళ్లని ఆపడం సరికాదని ధర్నా చేశారు. 10, 11, 12 వార్డుల్లో కౌంటింగ్ ఆపేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ పంచాయతీ మొత్తం కౌంటింగ్‌‌ను కలెక్టర్ నిలిపేశారు.

దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని చెట్టుకు కట్టేశారు

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నించారు. వీరిని వైసిపి నేతలు పట్టుకొని చెట్టు కట్టేశారు. వచ్చిన వారి టిడిపికి చెందిన వారని వారు ఆరోపించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్