ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..

15 నిమిషాల క్రితం

bloc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 30, 2026, 12:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​- డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నేతల ఉమ్మడి పోరు

- స్టాలిన్‌తో ప్రతిపక్ష అగ్రనేతల భేటీ

- డీలిమిటేషన్ కమిషన్‌లో జ్ఞానేశ్ కుమార్ ఉండటం ప్రమాదకరం : రాహుల్

- మరో మార్గం లేకనే మద్ధతు : స్టాలిన్‌

న్యూఢిల్లీ/చెన్నై : నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఓడించేందుకు ఇండియా బ్లాక్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం డిఎంకె అధినేత, తమిళనాడు నేత ఎంకే స్టాలిన్‌తో పాటు ఎన్‌‌సిపి(ఎస్‌‌పి) అధినేత శరద్ పవార్‌తోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేసే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించాలని వారు స్టాలిన్‌ను కోరారు. ఈ బిల్లుతో ఫెడరల్‌ ‌వ్యవస్థ భీటలు వారుతుందని, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని ఇండి బ్లాక్‌ ‌నేతలు స్టాలిన్‌‌కు వివరించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలే తమకు కీలకమని, ఈ బిల్లు వీగిపోతే.. తమిళనాడుకున్న రక్షణ పోతుందని ఆయన చెప్పుకొచ్చారు. వేరే ప్రత్యామ్నాయం లేదంటూ బిల్లుకు మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు.

స్టాలిన్‌తో గంటకు పైగా భేటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌ నేతల బృందం చెన్నైలోని అల్వార్‌పేట్‌లో ఉన్న స్టాలిన్ నివాసంలో గంటకు పైగా చర్చలు జరిపింది. ఈ బృందంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, కేరళం ముఖ్యమంత్రి విడి సతీశన్ కూడా పాల్గొన్నారు.

ఆర్‌ఎస్ఎస్ తమిళ వ్యతిరేక శక్తి : రాహుల్‌ గాంధీ

​ చెన్నైలో డిఎంకె అధినేత ఎం కె స్టాలిన్‌తో సమావేశమైన అనంతరం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ బిల్లు దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తమిళనాడుకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును వ్యతిరేకించాలని స్టాలిన్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే, ఆర్ఎస్ఎస్‌ తమిళ వ్యతిరేక శక్తి అని, తమిళ నాగరికత, భాష, సంస్కృతిపై దాడికి ప్రయత్నిస్తోందన్నారు. నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే డీలిమిటేషన్‌ కమిషన్‌లో జ్ఞానేశ్‌ కుమార్‌ సభ్యుడిగా ఉండటం, ఎన్నికల ఫలితాలను ముందే ప్రభావితం చేసే ప్రమాదకర చర్య అని విమర్శించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచి, నియోజకవర్గాల సరిహద్దులను బిజెపికి అనుకూలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. డిఎంకె బిల్లుకు మద్దతు ప్రకటించిందన్న ప్రశ్నకు, స్టాలిన్‌తో తాము జరిపిన చర్చల గురించే తాను వివరిస్తున్నానని రాహుల్‌ బదులిచ్చారు.

మా వైఖరిలో మార్పు లేదు: స్టాలిన్

భేటీ అనంతరం స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ఎంఎ బేబీ, మమతా బెనర్జీతో సహా పలువురు నేతలు, ముగ్గురు ముఖ్యమంత్రులు తనను కలిసి బిల్లుపై తమ అభిప్రాయాలను తెలిపారన్నారు. అయితే, డిఎంకె డిమాండ్లను కొత్త డీలిమిటేషన్ బిల్లులో చేర్చిన విషయాన్ని వారికి చెప్పానన్నారు. పునర్విభజన కమిషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకునేంత పార్లమెంటరీ బలం తమకు లేదని స్టాలిన్ తెలిపారు. 1971 తర్వాత ఏ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేసినా తమిళనాడుకు ప్రాతినిధ్యం, రాజకీయ బలం తగ్గుతాయన్నారు. తమతో సమావేశమైన పార్టీల వద్ద కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా చేయలేదు. పార్లమెంటులో ఉన్న బలంతో రాబోయే 25 ఏళ్లు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్నాం అని తెలిపారు.

బిల్లుకు మద్ధతివ్వడం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం : ఎన్‌‌సిపి ఎంఎల్ఎ

డీలిమిటేషన్‌ ‌బిల్లుకు మద్ధతు తెలిపిన పార్టీల్లోను సెగలు రేపుతుంది. బిల్లుకు మద్ధతు తెలపడాన్ని ఎన్‌‌సిపి (శరద్‌ పవార్‌) సొంత ఎంఎల్ఎ రోహిత్‌ పవార్‌ అసమ్మతి స్వరం వినిపించారు. డీలిమిటేషన్‌ ‌బిల్లును వ్యతిరేకించాలంటూ ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ సుప్రియా సూలేకు రోహిత్‌ పవార్‌ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్‌ బిల్లును పార్టీ ఎంపీలంతా వ్యతిరేకించాలని కోరారు. బిల్లుకు మద్దతివ్వడం పార్టీ సిద్ధాంతాలకు, శరద్‌ పవార్‌ ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. పునర్విభజనతో ఎస్‌‌సి, ఎస్‌‌టిలకు తగిన ప్రాతినిధ్యం దక్కదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం అంతర్గత ఒత్తిళ్లకు లొంగకుండా, కార్యకర్తలు–ఓటర్ల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శరద్ పవార్‌ ఆరోగ్యం బాగోలేనందున ఆయన సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, కావునా ఆ పార్టీ నేత సుప్రీయా సూలే నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. అయితే ఇండియా బ్లాక్ నేతలు ముంబైలో ఎన్‌‌సిపి (ఎస్‌‌పి) అధినేత శరద్ పవార్‌తోనూ సమావేశమయ్యారు. మరోవైపు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని సమాజ్‌వాదీ పార్టీ తన ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్