- రెండు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
ప్రజాశక్తి- టంగుటూరు (ప్రకాశం జిల్లా), జి.మాడుగుల (అల్లూరి జిల్లా) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తుండగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. దీంతో, తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చెరువు కొమ్ముపాలేనికి చెందిన జాగర్లమూడి శ్రీనివాసరావు (38), ఆయన భార్య శివ పార్వతి (30), కుమారుడు సాయి, కోటా కామేశ్వరమ్మ (52), సోమేపల్లి సాయికుమార్ (31) బెంగళూరులో నివాసముంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి టాటా నెక్సన్ కారులో స్వగ్రామానికి వీరు వస్తున్నారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టోల్ చెల్లించేందుకు ఆగడంతో దాని వెనుక వారి కారును ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐచర్ కంటైనర్ వారి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో, బస్సుకు, కంటైనర్‌కు మధ్య కారు నలిగిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న జాగర్లమూడి శ్రీనివాసరావు, కారులోని సాయికుమార్, కామేశ్వరమ్మ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన శివపార్వతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. బాలుడి సాయికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం బీరం పంచాయతీ సోలమరంగి గ్రామానికి చెందిన 15 మంది ఆటోలో బీరం బయలుదేరారు. సోలమరంగి ఘాట్ మలుపు సమీపంలో వారి ఆటో బోల్తా పడింది. దీంతో, ఆటోలోని కిల్లో రాజారావు (32) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సిఎం సంతాపం
ఓటు వేయడానికి వస్తూ టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదం పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోల్ గేట్ల వద్ద వాహనాల రాకపోకల నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.







కామెంట్లు (0)