గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరుపయోగంగా బాత్రూమ్‌లు

2 గంటల క్రితం

mylavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 03:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మైలవరం : మైలవరం మండలం దొడియం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాత్రూమ్‌లు నిరుపయోగంగా మారడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తుండగా, వారి కోసం నిర్మించిన బాత్రూమ్‌లు నీటి సౌకర్యం లేక పూర్తిగా నిరుపయోగంగా మారాయి. బాత్రూమ్‌లకు మోటర్‌ ఏర్పాటు చేసినప్పటికీ.. నీరు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లోకి చేరడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో బాత్రూమ్‌లను వినియోగించే అవకాశం లేక విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు బాత్రూమ్ అవసరాల కోసం పాఠశాల ఆవరణ దాటి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లిన చిన్నారులను వీధి కుక్కలు తరుముతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు భయంతో పరుగులు తీయడం, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు వెల్లడించారు.

అదే పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ కేంద్రం కూడా ఉండడంతో అక్కడి చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. బాత్రూమ్‌లు ఉన్నప్పటికీ నీటి సౌకర్యం లేక వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాత్రూమ్‌లకు తక్షణమే నీటి సౌకర్యం కల్పించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని, అలాగే పాఠశాల పరిసరాల్లో సంచరిస్తున్న వీధి కుక్కల సమస్యను పరిష్కరించి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది కోరుతున్నారు. చిన్నారులకు కనీస మౌలిక వసతులు, సురక్షితమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్