గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తోన్న అమెరికా ప్రకటన : చైనా

2 గంటల క్రితం

Mao Ning
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : ఇటీవల క్ష‍ిపణి ప్రయోగంపై అమెరికా విమర్శలను చైనా తిరస్కరించింది. అమెరికా ప్రకటన ద్వంద్వ ప్రమాణాలు, ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. క్ష‍ిపణి ప్రయోగం అంతర్జాతీయ చట్టాలకు, రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా క్ష‍ిపణి ప్రయోగం చేపట్టినట్లు స్పష్టం చేసింది. ప్రయోగానికి సంబంధించిన వివరాలను ముందే చైనా, అమెరికాతో పాటు ఇతర దేశాలకు అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. అనంతరం సంబంధిత సమాచారాన్ని సకాలంలో విడుదల చేసిందని అన్నారు. ఈసమాచారం అందించడంలో ఆలస్యం జరిగిందని లేదా అందులో తగినంత వివరాలు లేవని అమెరికా చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. చైనా వార్షిక సైనిక శిక్ష‍ణా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టామని, సంబంధిత ఆయుధ వ్యవస్థల విశ్వసనీయత, భద్రత, సమర్థతను నిర్థారించేందుకు నిర్వహించామని అన్నారు. ఏ దేశానికి లేదా నిర్దిష్ట లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్దేశించినది కాదని, అంతర్జాతీయ చట్టాలకు, విధానాలకు లోబడి ఉందని అన్నారు. సమాచారాన్ని ముందుగానే అందించడం, వెంటనే వెల్లడించడం చైనా సైన్యం బహిరంగతను, పారదర్శకతను నిరూపించిందని అన్నారు. సాయుధ పోరాటంలో అణ్వాయుధాలను ప్రయోగించిన ఏకైక దేశం అమెరికా అని, అణు జలాంతర్గాముల నుండి ఏటా వ్యూహాత్మక క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తోందని ఆమె విమర్శించారు. కానీ చైనా సాధారణసైనిక విన్యాసాలుగా పరిగణించే వాటిని ప్రశ్నిస్తోందని విమర్శించారు. చైనా జాతీయ భద్రత, సైనిక అభివృద్ధిని "నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా" అంచనా వేయాలని, అలాగే "ప్రపంచ వ్యూహాత్మక స్థిరత్వాన్ని కాపాడటానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని" ఆమె అమెరికాను కోరారు. అణు జలాంతర్గామి నుండి డూప్లికేట్‌ శిక్షణా వార్‌హెడ్‌ను మోసుకెళ్తున్న వ్యూహాత్మక క్షిపణిని చైనా ఇటీవల ప్రయోగించిన సంగతి తెలిసిందే. పసిఫిక్ మహాసముద్రంలోని నిర్దేశిత ప్రాంతంలో క్షిపణి పడిన తర్వాత ఈ పరీక్ష విజయవంతమైందని చైనా ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్