మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకోనసీమలో బ్లోఅవుట్‌

22 నిమిషాల క్రితం

ఒఎన్‌‌జిసి గ్యాస్ లీకేజీ
- వర్కోవర్‌ పనులు జరుగుతుండగా ఘటన
 - సమీప ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలింపు
 - ముందస్తుగా రహదారిపై రాకపోకలు నిలిపివేత
- పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ఒఎన్‌జిసి నిపుణులు
-  సిఎం, ఉపముఖ్యమంత్రి ఆరా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వర్కోవర్‌ పనులు జరుగుతుండగా ఘటన

  • సమీప ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలింపు

  • ముందస్తుగా రహదారిపై రాకపోకలు నిలిపివేత

  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ఒఎన్‌జిసి నిపుణులు

  • సిఎం, ఉపముఖ్యమంత్రి ఆరా

ప్రజాశక్తి - మామిడికుదురు, అమలాపురం : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెడ్డాడ గ్రామంలో ఒఎన్‌‌జిసి బావి వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్‌ బ్లోఅవుట్‌ సంభవించింది. జాతీయ రహదారి 216 పక్కన ఉన్న ఈ బావిలో వర్కోవర్ పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్యాస్‌ లీకవ్వడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు రిగ్ చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో నివసిస్తున్న సుమారు 200 నుంచి 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని 216వ జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఒఎన్‌జిసి సాంకేతిక నిపుణులు గ్యాస్ బ్లోఅవుట్‌ పూర్తిగా అరికట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరమ్మతులు జరుగుతుండగా గ్యాస్‌ లీకేజీ : ఒఎన్‌జిసి

మరమ్మతు పనులు జరుగుతుండగా గ్యాస్‌ లీకేజీ జరిగినట్లు ఒఎన్‌జిసి ఓ ప్రకటన విడుదల చేసింది. సమాచారం అందిన వెంటనే రాజమండ్రి విపత్తు నిర్వహణ బృందాన్ని ఒఎన్‌జిసి అప్రమత్తం చేసింది. వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని తగిన భద్రత, వెల్‌ కంట్రోల్‌ చర్యలను ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యగా బావి చుట్టూ 500 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని దిగ్బంధించి, సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వాటర్ బ్లాంకెట్‌ను ఏర్పాటు చేశారు. గ్యాస్ సాంద్రత పరీక్షల్లో ప్రస్తుతం జీరోగా నమోదైనట్లు పేర్కొంది.

ప్రజల భద్రతకు ప్రాధాన్యం: సిఎం

గ్యాలీ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, లీకేజీని నియంత్రించేందుకు ఒఎన్‌జిసి ప్రత్యేక సాంకేతిక బృందాలతో యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఒఎన్‌జిసి చైర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులను సంప్రదించి భద్రతా చర్యలను సమీక్ష‍ించాలని ఆదేశించారు. వరుస ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆడిట్‌ నిర్వహించాలని అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్