మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగుజరాత్‌ను వీడిన బిల్కిస్‌ బానో కుటుంబం

-700 నిమిషాల క్రితం

గుజరాత్‌ను వీడిన బిల్కిస్‌ బానో కుటుంబం
దోషులకు సుప్రీం బెయిల్‌తో భయాందోళన
తీవ్ర దిగ్భ్రాంతిని, అవిశ్వాసాన్ని కలిగించింది : బానో
అన్యాయం పునరావృతం : సిపిఎం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:24 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • దోషులకు సుప్రీం బెయిల్‌తో భయాందోళన

  • తీవ్ర దిగ్భ్రాంతిని, అవిశ్వాసాన్ని కలిగించింది : బానో

  • అన్యాయం పునరావృతం : సిపిఎం

అహ్మదాబాద్ : ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేస్తూ, వారి యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో భయభ్రాంతులకు, దిగ్భ్రాంతికి గురైన బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులు గుజరాత్‌ను విడిచివెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె బంధువు మంగళవారం తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో పసిబిడ్డ సహా ఏడుగురి హత్య కేసులో 2008లో ముంబైలోని ప్రత్యేక సిబిఐ కోర్టు 11 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్దియాలకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను అక్టోబర్‌ 28న సుప్రీంకోర్టు నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘకాలం జైలులో గడిపారని, మంచి ప్రవర్తన కలిగివున్నారని పేర్కొంటూ గుజరాత్‌ ప్రభుత్వం 11 మందినీ 2022లో విడుదల చేయగా, 2024 జనవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనారోగ్యంతో ఉన్నామని, సుదీర్ఘ కాలం జైలులో ఉన్నామని దోషులిద్దరూ పెట్టుకున్న పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిబి వరలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్‌ 28న బెయిల్ మంజూరు చేసింది. అత్యంత క్రూరమైన కేసుల విషయంలో సానుభూతి చూపకూడదన్న అంశాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​గుజరాత్‌ విడిచి వెళ్లిపోయారు : బానో మామ రజాక్‌

​"బిల్కిస్‌ బానో ఇటీవలి వరకు గుజరాత్‌లోనే ఉంది, అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత, ఆ కుటుంబం ఈ నెల 2 - 3 తేదీల్లో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయింది. భయం కారణంగా, ఆ కుటుంబం ఎప్పటికప్పుడు తమ నివాస స్థలాన్ని మార్చుకుంటూ, గుజరాత్‌లోనే ఉంటుంది. ఈసారి మాత్రం, వారు గుజరాత్‌ను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు," అని గుజరాత్‌లోని దాహోద్ జిల్లా దేవ్‌గఢ్ బరియా పట్టణంలో నివసిస్తున్న ఆమె మామ రజాక్ మన్సూరి తెలిపారు. ​"ఈ దోషులు పెరోల్‌పై బయట ఉన్నప్పుడు తరచుగా గ్రామానికి తిరిగి వస్తుంటారు. కొన్నిసార్లు 15 రోజులు, కొన్నిసార్లు నెల రోజుల వరకు ఉంటారు. వారు ప్రస్తుతం ఇంకా గోధ్రా, దాహోద్ ఉప జైళ్లలోనే ఉన్నారు. ఒక దోషి ప్రస్తుతం ఒక నెల పెరోల్‌పై బయట ఉన్నాడు," అని చెప్పారు. దోషులు బెయిల్ పై బయటకు వస్తే తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె భయాందోళనతో ఉన్నారని తెలిపారు.

బాధ, దిగ్భ్రాంతి, అవిశ్వాసం కలిగించిన తీర్పు : బిల్కిస్ బానో కన్నీటి ప్రకటన

సుప్రీంకోర్టు తీర్పు తనకు దిగ్భ్రాంతిని, న్యాయవ్యవస్థపై అవిశ్వాన్ని కలిగించిందని బిల్సిస్‌ బానో పేర్కొన్నారు. సీనియర్‌ న్యాయవాది శోభా గుప్తా ద్వారా బిల్కిస్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. "బాధ, దిగ్భ్రాంతి, అవిశ్వాసం వల్ల వచ్చిన తాజా కన్నీళ్ల మధ్య నుంచి మాటలు నెమ్మదిగా వస్తున్నప్పటికీ నేను ఈ ప్రకటన చేస్తున్నాను. నన్ను పిలవకుండా, నా వాదన వినకుండా సుప్రీంకోర్టు మరోసారి, రెండోసారి కూడా ఒక ఉత్తర్వు జారీ చేసిందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఈ విషయం నాకు పత్రికా కథనాల ద్వారానే తెలిసింది." అని పేర్కొన్నారు. తనకు అన్యాయం చేసిన నిందితుల శిక్షను నిలిపివేస్తూ అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు కూడా తనకు సమాచారం ఇవ్వలేదని, తన వాదనను కూడా వినలేదని ఆమె తెలిపారు. ‘‘శిథిలమైన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాను. నవ్వడం నేర్చుకున్నాను. కానీ, అక్టోబర్‌ 28 నాటి ఉత్తర్వులు నన్ను మరోసారి భయాందోళనకు గురిచేశాయి’’ అని పేర్కొన్నారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. ‘‘ నేను తప్పనిసరిగా ఈ పోరాటం చేయాలి. నా పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. వారు జీవితాంతం భయాలు, గాయాల జ్ఞాపకాలతో బతకాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరి కోసం కూడా నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే ఏ మహిళా, బాధితురాలైనా, పౌరురాలైనా తమ అస్తిత్వాన్ని, సమానత్వ హక్కును నిరూపించుకునేందుకు నిరంతరం పరీక్షలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. జీవితాంతం న్యాయం కోసం పోరాడాల్సిన దుస్థితి రాకూడదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు దిగ్ర్భాంతికరం : ఎంఎ బేబీ

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు దిగ్భ్రాంతి కలిగించిందని, దీనిని ఖండిస్తున్నామని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. సామూహిక అత్యాచారం, హత్య నేరాలకు గాను శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులలో ఇద్దరికి, సుదీర్ఘ జైలు శిక్షను కారణంగా చూపుతూ వారి శిక్షను నిలిపివేసి బెయిల్ మంజూరు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విచారణ కూడా లేకుండానే ఏళ్ల తరబడి రాజకీయ ఖైదీల మాదిరిగా జైళ్లలో మగ్గుతున్న యువ కార్యకర్తలకు కోర్టులు ఇప్పటికీ బెయిల్ మంజూరు చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. అత్యంత క్రూరమైన నేరాలలో దోషులుగా తేలిన వారిని విడుదల చేయడాన్ని కోర్టు సమంజసంగా భావిస్తోందని విమర్శించారు. కోర్టు స్వయంగా అంగీకరించిన ప్రకారం, ఎప్పటికప్పుడు ఉదారంగా పెరోల్, ఫర్లో సదుపాయాలు పొందినప్పటికీ, 2022లో గుజరాత్ ప్రభుత్వం నుండి శిక్షా తగ్గింపు (రెమిషన్) పొందేందుకు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసిన నేరస్తులే వీరని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు న్యాయాన్ని నిరాకరించిందని పేర్కొన్నారు. న్యాయం కోసం బిల్కిస్ బానో చేస్తున్న పోరాటం అందరికీ సంబంధించినదని, ఆమె పోరాటానికి అండగా నిలబడతామని బేబీ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్