కోరుకొండ (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో వైసిపి నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత పార్టీకి చెందిన ఎంపిటిసి అభ్యర్థిపై ఆయన దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కోరుకొండ మండలానికి చెందిన వైసిపి ఎంపిటిసి అభ్యర్థి అనపర్తి మణికంఠ పై జక్కంపూడి రాజా భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితుడు మణికంఠ వెంటనే పోలీసులను ఆశ్రయించి, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ జక్కంపూడి రాజాపై కోరుకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా, ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
వైసిపి నేత జక్కంపూడి రాజా పై కేసు నమోదు
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)