ప్రజాశక్తి-దేవరాపల్లి (అల్లూరి) : అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన భరీ పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ... బల్లగరువు నుంచి తునసీబు వరకు జరుగుతున్న రోడ్డు పనుల కోసం బొలోరో వాహనంలో ప్రయాణికులతోపాటు డీజల్, గ్యాస్ సిలిండర్, పలు పేలుడు పదార్థాలుతో దేవరాపల్లి నుంచి బయలుదేరిన వాహనం పీచుమామిడి వద్దకు చేరుకుంది. అక్కడ అప్పటికే ఉన్న మినీ టిప్పర్ లోకి బొలోరోలో ఉన్న డీజిల్ ను మారుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి బొలెరోలో ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు సునీతతో పాటు, దేవరాపల్లికి చెందిన మన్నెల మణికంఠ, చీడికాడకి చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్ కుమార్, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. అస్సాం కు చెందిన నసీరుద్దీన్, బీహార్ కి చెందిన టింకూ ఆచూకీ తెలియాల్సి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పేలుడు ఘటన జరగడంతో మృతుల శరీర భాగాలు చెల్లా చదురుగా పడిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టతరమైంది. అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హ ఆదేశాల మేరకు దేవరాపల్లి ఎస్సై వి సత్యనారాయణ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాల గుర్తించే పని చేపట్టారు. స్థానికుల సహకారంతో ఎస్ఐ అప్పటికే దగ్ధమవుతున్న వాహనాలను మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న చోడవరం అగ్నిమాపక శకటం వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన పీచుమామిడి గ్రామస్తులు పరుగులు తీశారు.
రోదనలతో మిన్నంటిన ఘటనా స్థలం ...
ఈ ప్రమాద ఘటనలో విశాఖకు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు సునీత గత సంవత్సర కాలంగా పెదకోట పంచాయతీ మడ్రేబు ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు దేవరాపల్లి వరకు ఆర్టీసీ బస్సు మీద వచ్చి అక్కడి నుంచి స్థానికుల వాహనాల పైన విధులకు వెళ్లేవారు. ఉదయం తమ పాఠశాల హెచ్ఎం స్వాతి కి ఆరున్నర సమయంలో పాఠశాలకు వస్తున్నానని ఫోన్లో సమాచారం ఇచ్చిన ఆమె దేవరపల్లి వచ్చేసరికి అందుబాటులో స్కూల్ వరకు వెళ్లే బొలోరో వాహనం ఉండటంతో ఆ వాహనంపై విధులకు బయలుదేరగా జరిగిన దారుణఘటనలో ఆమె మృత్యువాత పడ్డారు. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యులతో పాటుగా, తోటి ఉపాధ్యాయుల రోదనలు మిన్నంటాయి. ఇదే ప్రమాదంలో దేవరాపల్లికి చెందిన యువకుడు మన్నెల మణికంఠ (20) కాంట్రాక్టర్ వద్ద రోడ్డు పనులకు ఎనిమిది నెలల నుంచి వెళ్తున్నాడు. యధావిధిగా విధులకు ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు తన తల్లి యర్ణమ్మ వద్ద 500 రూపాయలు పెట్రోల్ నిమిత్తం తీసుకున్న ఆ యువకుడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత కాంట్రాక్టర్ బోలోరో వాహనంలో వచ్చేయమన్నారని చెప్పి డబ్బులు ద్విచక్ర వాహనాన్ని ఇంటి దగ్గరే ఉంచి, తల్లితో పనికి వెళ్లి వస్తానని చెప్పిన కొడుకు మార్గమధ్యంలోనే మృతి చెందడంతో ఆ తల్లితోపాటుగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలానికి అనంతగిరి ఎస్సై కె.శంకర్రావు చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు ద్వారా తెలుసుకున్నారు.








కామెంట్లు (0)