- ఎమ్మెల్యే ఇంటి ముందు కార్యకర్తల ఆందోళన
ప్రజాశక్తి - అనంతపురం: సింగనమల మండల ఎంపీపీ అభ్యర్థి మార్పు తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసమ్మతికి దారితీసింది. మొదటి నుంచి ఎంపీపీ అభ్యర్థిగా పేట తులసి పేరు ఖరారు చేసినప్పటికీ, చివరి నిమిషంలో ఆమెను పక్కనపెట్టి నిధనవాడ ఎంపీటీసీ గొల్ల హరితకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
ఎంపీపీ ఎన్నికల ప్రారంభంలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు, న్యాయవాది ఈశ్వర్‌రెడ్డి కోడలు పేట తులసిని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి సమాన సంఖ్యలో స్థానాలు రావడంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. చివరకు టాస్ ద్వారా ఎంపిక జరిగే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం వివాదానికి కారణమైంది. పేట తులసి గెలుపు కోసం ఈశ్వర్‌రెడ్డి వర్గం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరో అభ్యర్థికి అవకాశం కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామాలపై గురువారం అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయం, నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని పేట తులసికే ఎంపీపీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన క్యాడర్‌కు గుర్తింపు ఇవ్వకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
ఈ వివాదంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీతో పాటు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుపై కూడా కార్యకర్తలు ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులతో అంతర్గత అవగాహనతోనే అభ్యర్థి మార్పు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల నుంచి డబ్బులు తీసుకుని నిర్ణయాలు మార్చారన్న ఆరోపణలు కూడా చేశారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు.
అంతేకాకుండా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ మధ్య రాజకీయ అవగాహన ఉందన్న అనుమానాలను కార్యకర్తలు వ్యక్తం చేశారు. వీరి ఫోన్‌కాల్ వివరాలపై పార్టీ అధిష్ఠానం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సంబంధిత నాయకుల స్పందన తెలియాల్సి ఉంది.
ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొనలేదని, అభ్యర్థులకు తగిన సహకారం అందించలేదని కూడా కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు ధర్మవరం సుబ్బారెడ్డి సూచనలను కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని ఎంపీపీ అభ్యర్థి ఎంపిక వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని సింగనమల పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.








కామెంట్‌లు (0)