సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్త పింఛన్లు కోతలేనా..!

1 గంట క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:40 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • నిబంధనలతో ఉక్కిరి బిక్కిరి

  • ఎనిమిది రకాల పత్రాలు ఇవ్వాలంటూ ఆంక్షలు

  • స్థానిక ఎన్నికల ఎరేనన్న అనుమానాలు

  • కొత్త నిబంధనలతో ఉక్కిరి బిక్కిరి

​ప్రజాశక్తి - యంత్రాంగం : కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్న ఆనందం ఆందోళనగా మారుతుంది. పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలిరోజే ప్రభుత్వం విధించిన నిబంధనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందించాలన్న ఉద్దేశం కంటే.. సాధ్యమైనంత తక్కువ మందికి పింఛన్లు మంజూరు చేసేలా నిబంధనలు రూపొందించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పింఛన్ల ప్రకటన చేయడం, ఓటర్లను ఆకర్షించేందుకు వేసిన ఎరలా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పింఛను దరఖాస్తు చేయడానికి పెట్టిన నిబంధనలు, అడుగుతున్న పత్రాలు దీనికి కారణం. ఒక్క పత్రం లేకపోయినా దరఖాస్తు ఆన్‌లైన్‌లో ముందుకు సాగడం లేదు. సర్వర్‌ సమస్యలు, ఒటిపి నిబంధనలు అదనపు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.

కొత్త పింఛను దరఖాస్తుకోసం ఎనిమిది రకాల పత్రాలను తప్పనిసరి చేసిన ప్రభుత్వం వాటితో పాటు కేటగిరీని బట్టి అదనపు అర్హత పత్రాలు కూడా సమర్పించాలని నిర్ధేశించింది. ఉదాహరణకు వృద్ధాప్య పింఛనుకు వయస్సు ధ్రువీకరణ, వితంతు పింఛనుకు భర్త మరణ ధ్రువీకరణ, వికలాంగ పింఛనుకు సదరం సర్టిఫికెట్‌, ఒంటరి మహిళలకు విడాకుల పత్రాలు వంటివి తప్పనిసరి అని పేర్కొనడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 16వ తేదిన చివరి తేదిగా ప్రకటించడంతో ఆ లోగానే పత్రాలన్ని సమకూర్చుకోవాల్సి రావడం దరఖాస్తుదారులకు మరింత కష్టంగా మారుతోంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరిగా జీవించే మహిళలు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

​కుల ధ్రువీకరణకు కొత్త షరతులెందుకు?

​కుల ధ్రువీకరణ పత్రం ఒక్కసారి జారీ అయితే.. వ్యక్తి కులం మారదు. అలాంటప్పుడు గతంలో జారీ చేసిన చెల్లుబాటు అయ్యే కుల ధ్రువీకరణ పత్రాలను పింఛను దరఖాస్తుకు స్వీకరించకుండా.. 2026లో జారీ చేసినవే కావాలని షరతు పెట్టడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలామంది తమ పేరుతో ఇప్పటికే కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నప్పటికీ.. అవి పాతవిగా భావించి మళ్లీ కొత్తవి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది దరఖాస్తుదారులపై అనవసరమైన భారం మోపడమే తప్ప మరొకటి కాదు. ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఈ ఏడాదిదే కావాలని అడుగుతుంటం కూడా సమస్యగా మారుతోంది. సమయం తక్కువ గా ఉండటం దీనికి కారణం. దీంతో హడావిడిగా కార్యాలయాల చుట్టు తిరగాల్సిరావడం దరఖాస్తు దారులకు కష్టంగా మారుతోంది.

​ఒంటరి మహిళ అంటే...!

ఒంటరి మహిళ కేటగిరి కింద పింఛను పొందడానికి విడాకుల సర్టిఫికేట్ తప్పని సరి అనడం కూడా చర్చనీయాంశంగా మారింది. విడాకులు పొందిన వారే కాకుండా భర్త వదిలివేయడం, భర్త దీర్ఘకాలంగా కనిపించకపోవడం, కుటుంబ పరిస్థితులు, భర్తతో కలిసి జీవించలేని పరిస్థితులు, ఇతర సామాజిక, కుటుంబ కారణాల వల్ల కూడా అనేక మంది మహిళలు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి వారి వాస్తవ పరిస్థితిని పరిశీలించకుండా కేవలం విడాకుల పత్రం లేదన్న కారణంతో ఇచ్చే కొద్ది పాటి ఆర్థికసాయానికి దూరంచేయడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న వస్తోంది.

​‘ఇంటి పన్ను’ అందరికీ ఎలా...?

ఆస్తి పన్ను రసీదు, ఇంటిపన్ను నంబరు వంటి వివరాలను దరఖాస్తులో తప్పనిసరి చేయడం మరో సమస్యగా మారుతోంది. సొంత ఇళ్లు, ఆస్తులు ఉన్న వారు అసలు పింఛను కోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటారన్న ప్రశ్న ఒకటికాగా, అద్దె ఇళ్లలో నివసించే వారు ఆ పత్రాలను ఎలా అందిస్తారన్నది మరో ప్రశ్న! ఇంటి యజమానుల ఆ కాగితాలను అద్దెకు ఉండే వారికి ఇవ్వరన్న సంగతి తెలిసిందే. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోని స్లమ్‌లు, అనధికార నివాస ప్రాంతాల్లో వేలాది పేద కుటుంబాలు ఇళ్ల పన్ను చెల్లించకుండానే నివసిస్తున్నాయి. వారికి ఇల్లు ఉన్నా.. ఆ ఇంటికి ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌ ఉండకపోవచ్చు. అలాంటి కుటుంబాల్లో పింఛనుకు అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నప్పటికీ.. ఇంటిపన్ను రసీదు లేకపోవడం వారి దరఖాస్తుకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.

​ఒక ఇంట్లో ఒకరికే...!

​ఒకే ఇంట్లో ఒకరికే పింఛను అన్న నిబంధనతో మరో సమస్య తలెత్తుతోంది. ఒకే కుటుంబంలో వృద్ధ తల్లి, వికలాంగ కుమారుడు లేదా వృద్ధ దంపతులు వంటి ఇద్దరు అర్హులు ఉన్నప్పటికీ ఒకరికి పింఛను ఇస్తామనడం మరో సమస్యగా మారుతోంది. ఇది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించకపోగా, ఒకరు చనిపోతేనే మరొకరికి పింఛను వచ్చే పరిస్థితిని సృష్టిస్తోంది. ఇంటిపన్ను, విద్యుత్తు బిల్లు వంటి వివరాలు ఒకరి పేరుతోనే ఉండే సందర్భాల్లో.. అదే ఇంట్లో ఉన్న మరో అర్హుడికి పింఛను దొరికే పరిస్థితి లేదు. ఓటరు కార్డు లేకపోతే గ్యాస్‌ బుక్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ప్రత్యామ్నాయ పత్రాలను చూపించాలని అడుగుతున్నారు. అవి కూడా లేకపోతే పింఛను మంజూరుకాదు.

పత్రాలు తీసుకుని పంపిస్తున్న సిబ్బంది

​పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో సచివాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. పత్రాలు అన్నీ ఉన్నప్పటికీ సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌ నమోదు ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల సిబ్బంది దరఖాస్తుదారుల నుంచి పత్రాలు తీసుకుని.. ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో ఫోన్‌ చేస్తామని చెబుతున్నారు. ఆధార్‌తో నమోదైన మొబైల్‌ నంబరుకు వచ్చే ఓటీపీని చెప్పిన తర్వాతే ప్రక్రియ పూర్తవుతుందని వివరిస్తున్నారు. ఒటిపి వచ్చిన తరువాత 10 నిమిషాల్లోపే నమోదు చేయాల్సి ఉండటంతో దరఖాస్తుదారులు ఫోన్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. సర్వర్‌ డౌన్‌, వెబ్‌సైట్‌ నెమ్మదిగా పనిచేయడం వంటి సాంకేతిక సమస్యలు కూడా మొదటి రోజు ఇబ్బంది పెట్టాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్