- రాజమహేంద్రవరంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డిజిపి హరీష్ కుమార్ గుప్త
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : సైబర్ నేరాల నియంత్రణకు ‘క్లిక్’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు పెట్రోలు బంకు సమీపంలో నెలకొల్పిన ఫోరెన్సిక్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సైబర్ నేరాలను అరికట్టేందకు స్పెషలిస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లు, బ్యాంకర్లు, టెలికాం ఆపరేటర్ల ప్రతినిధులతో కూడిన 'సైబర్ వార్ రూమ్'ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబర్ నేరం జరిగిన 30 నిమిషాల(గోల్డెన్ పీరియడ్)లోనే స్పందించి బాధితుల అకౌంట్లను ఫ్రీజ్ చేసేలా టీమ్ చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా స్థాయిలో ‘క్లిక్’ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో బిటెక్, ఎంటెక్, ఎంసిఎ విద్యార్హతలు కలిగిన 20 మంది కానిస్టేబుళ్లతో ఈ 'క్లిక్' ప్రత్యేక సైబర్ టీమ్‌లను ఎస్‌పి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిజిటల్ ఫొరెన్సిక్ టూల్స్ వినియోగంతో పాటు అవసరమైతే ప్రైవేట్ లాబొరేటరీలతో ఒప్పందాలు, నిపుణులను కాంట్రాక్టు లేదా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాలకు ఎఐ, డ్రోన్లతో బందోబస్తు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ల వద్ద యత్రికుల రద్దీని ముందుగా గుర్తించేందుకు ఈ ఆధునిక సాంకేతికత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తిరుమల తరహా మోడల్ గా తిరుమల శ్రీవారి దర్శనంలో ఉపయోగించే కంపార్ట్‌మెంట్ విధానం తరహాలోనే ఘాట్ల వద్ద యాత్రికులను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజమహేంద్రవరంలో రెండు వేల సిసి కెమెరాలను నిరంతరం రికార్డింగ్ మోడ్‌లో ఉంచి కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని వివరించారు.
‘ప్రియాంక’ నిందితులకు కఠిన శిక్ష
డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై డిజిపి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులకు స్పెషల్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందిస్తూ ఇప్పటి వరకూ జరిగిన పోలీసు దర్యాప్తులో అలాంటి ఆధారాలు ఏవీ నిరూపితం కాలేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఏలూరు రేంజ్ డిఐజి అశోక్, ఎస్.పి నరసింహకిశోర్, డిఎస్.పిలు తదితరులున్నారు.








కామెంట్‌లు (0)