- ఎండిన పండ్ల చెట్లతో అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళన
- కర్నూలులో మిగిలిన 12 మండలాలనూ కరువుగా ప్రకటించాలి
ప్రజాశక్తి - అనంతపురం, కర్నూలు కలెక్టరేట్ : కరువు మండలాలుగా ప్రకటిస్తేనే సరిపోదని, సహాయ చర్యలు చేపట్టి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం, కర్నూలు కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. అనంతపురంలో ఎండిన పండ్ల తోట చెట్లను, నాసిరకంగా పండిన పండ్లను చేతపట్టుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పిజిఆర్ఎస్లో కలెక్టర్ ఒ.ఆనంద్ను కలిసి వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... పారిశ్రామిక అభివృద్ధి, హార్టికల్చర్ హబ్ల పేరుతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఎండిపోయిన పంటలు, అప్పులతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు, వర్షాభావంతో పంటలు వేయలేక భూములను బీడుగా వదిలేసిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాయదుర్గం, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించాలని కోరారు.
కర్నూలు జిల్లాలో మిగిలిన 12 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలన చేయకుండా ఉపగ్రహ నివేదికల ఆధారంగా కేవలం 15 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్దేశాయ్ విమర్శించారు. కోసిగి, కౌతాళం, దేవనకొండ, ఆస్పరి వంటి కరువు ప్రభావిత ప్రాంతాలను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖామర్కు వినతిపత్రం అందజేశారు. మిగిలిన మండలాల్లో సర్వే నిర్వహిస్తున్నామని, రెండో విడతలో కరువు మండలాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.








కామెంట్లు (0)