బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరసనలను ఉద్దేశ్యపూర్వకంగా అప్రతిష్టపాలు చేస్తున్న మోడీ ప్రభుత్వం

1 గంట క్రితం

cpi mp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ప్రజా నిరసనలను ఉద్దేశ్యపూర్వకంగా అప్రతిష్టపాలు చేస్తోందని సిపిఐ ఎంపి సంతోష్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ జోక్యంపై నిరాధారమైన ఆరోపణలతో జవాబుదారీతనం నుండి తప్పించుకుంటోందని అన్నారు. నిరసనలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పదేపదే చేస్తున్న ఆరోపణలపై బుధవారం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎప్పుడు నిరసనలు జరిగినా, విదేశీ నిధుల ఆరోపణ చేయడమే బిజెపికి ప్రధాన అజెండాగా మారిందని అన్నారు. విద్యార్థులు, యువత, రైతులు ఆందోళనలు చేస్తుంటే, నీ బిజెపి జీర్ణించుకోలేకపోతుందని, దీంతో ఈ నిరసనల వెనుక దేశద్రోహులు, దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, విదేశీ నిధులతో ఆందోళనలు జరుగుతున్నాయని పదేపదే ఆరోపిస్తోందని అన్నారు. స్వతంత్ర పోరాటాల నుండే తగిన పాఠాలు నేర్చుకున్నామని అన్నారు. ఉదాహరణకు, కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ చరిత్ర ఉందని అన్నారు. ఇటువంటి సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయని, ప్రజా ఉద్యమాల ద్వారా సంపాదించిన అపారమైన అనుభవం కూడా ఉందని అన్నారు. విదేశీ నిధులు లేదా ఇతరత్రా ఎలాంటి సహాయం తమకు అవసరం లేదని కుమార్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రధాని మోడీ, ఆయన సహచరులు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పక్షపాతంతో చేస్తున్న ఈ ఆరోపణలపై ప్రధానితో పాటు ఎవరినైనా బహిరంగ చర్చకు ఆహ్వానించే హక్కు తమకు ఉందని అన్నారు. ప్రభుత్వ పరిపాలనా చర్యలపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు సమంజసమైనవేనని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలు వాస్తవమైనవేనని తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. సర్‌ ప్రక్రియపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా నుండి పెద్ద సంఖ్యలో ఓటర్లను క్రమపద్ధతిలో తొలగించడమే ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఉద్దేశమని అన్నారు. ఇప్పటికే సుమారు 14 శాతం మంది ఓటర్లు ఈ ప్రక్రియ వల్ల ప్రభావితమయ్యారని అన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం (ఈసి) క్రమంగా అంగీకరిస్తోందని, దీంతో తమ ఆందోళనల్లోని వాస్తవాలు మరింత స్పష్టమవుతున్నాయని వ్యాఖ్యానించారు. దేశద్రోహి ఎవరో చర్చించేందుకు రావాలని లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి బహిరంగ చర్చకు సవాలు విసిరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్