సాఫ్టు బాల్ కడప జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
ప్రజాశక్తి-రాజంపేట : రాజకీయ క్రీడల్లో భాగంగా క్రీడాకారులను, క్రీడల వల్ల ఉద్యోగాలు పొందిన క్రీడా ఉపాధ్యాయులకు లాగొద్దని, వారిపై అనుచిత వ్యాఖ్యలు, దాడులు చేయడం పద్ధతి కాదని కడప జిల్లా సాప్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి లు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. సోమవారం విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు క్రీడా ఉపాధ్యాయులపై వ్యవహరించిన తీరు పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలకు, క్రీడాకారులకు రాజకీయాలతో పనిలేదని, ఎంతోమంది క్రీడాకారులు వైసీపీ పాలనలో కూడా సర్టిఫికెట్లు పొంది ఉన్నారని, నేడు ఆ సర్టిఫికెట్లు కూడా నకిలీవని చెబుతూ క్రీడాకారులను అవమానపరిచేలా, క్రీడల వల్ల ఉద్యోగాలు పొందిన వారిని అవమానిస్తూ మాట్లాడడం సరికాదని, తప్పు జరిగి ఉంటే వాటిపై న్యాయపరంగా పోరాడే అవకాశం ఉందని, అలా కాకుండా క్రీడా ఉపాధ్యాయులపై భౌతిక దాడులు దిగడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారు పని చేసే పాఠశాలల వద్ద వారికి ఇబ్బందులు కలిగించడం మంచి పద్ధతి కాదని, ఇలా వ్యవహరించడం వలన భవిష్యత్తులో క్రీడాకారులు క్రీడలు ఆడాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని, క్రీడలను, క్రీడాకారులను, క్రీడల వల్ల ఉద్యోగాలు పొందే వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం రాజకీయ పార్టీలకు తగదని వారు తెలియజేశారు.
క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు:
ఏళ్ల తరబడి మైదానంలో చెమటోడ్చి, కఠిన శ్రమతో పతకాలు సాధించి, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి న్యాయబద్ధంగా ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులపై రాజకీయ పార్టీల నాయకులు, వారి అనుచరులు దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సమాజం గౌరవించే ఉపాధ్యాయ వృత్తికి ఎంపికైన వారిపై నీచపు వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర పదజాలంతో దూషించడం నాగరిక సమాజం తలదించుకునే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై, భావి భారత పౌరులను తీర్చిదిద్దే స్పోర్ట్స్ టీచర్లపై జరిగిన ఈ భౌతిక దాడులను, అనుచిత ప్రవర్తనను సమాజంలోని అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే భవిష్యత్తులో క్రీడాకారులు ఇబ్బందులు పడతారని, బాధితులకు క్రీడా లోకం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని వారు స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)