- 24న విచారణకు హాజరు?
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు జారీ చేసినా తనకు నోటీసులు అందలేదని చెబుతూ విచారణకు హాజరు కాలేదని తెలిసింది. దీంతో తిరిగి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఫోన్ చేసి ఈ నెల 24న ఈడి కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయంలో మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఈడి అధికారులు ఈ కేసులో అంబటి ప్రమేయంపై కూడా ఆరా తీశారని తెలిసింది. మద్యం కుంభకోణంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న అనేక మంది వైసిపి నాయకులు, మాజీ అధికారులతో అంబటి తరచూ ఫోన్ సంభాషణ చేసిన నేపథ్యంలో అదనపు సమాచారం కోసం విచారించాలని ఇడి అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్యం రవాణా చేసిన వ్యవహారంలో ఇప్పటికే అరెస్టు కాగా గుంటూరు జిల్లాకు సంబంధించి రవాణా కాంట్రాక్టు గత ప్రభుత్వం హయాంలో అంబటి రాంబాబు నిర్వహించారని సమాచారం. దీంతో, అంబటిని కూడా విచారణకు పిలిచారని వైసిపి వర్గాలు అంటున్నాయి. అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై పలుమార్లు వ్యక్తిగతంగా విమర్శలు చేసిన నేపథ్యంలో తనను ఈడి ద్వారా మద్యం కేసులో ఇరికించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. విచారణ నిమిత్తం ఈడి కార్యాలయానికి రావాలని అధికారులు తనకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే, తాను ఈ కేసులకు భయపడనని తెలిపారు. ఈ నేపథ్యంలో అంబటి 24న విచారణకు హాజరు అవుతారా లేదో వేచి చూడాల్సిందే.








కామెంట్‌లు (0)